కిమ్ మృతి? రహస్యంగా మృతదేహాం? ఫోటోలు వైరల్ కావడంతో ఊహించని ట్విస్ట్
మంగళవారం ఉదయం ప్రపంచం నిద్రలేచే సమయానికి ఓ వార్త.. అది చూసిన వారాంతా ఒక్కసారిగా షాక్.. యావత్ దునియానే గడగడలాడించే సత్తా ఉన్న ఓ లీడర్ మృతి చెందారంటూ బిగ్ బ్రేకింగ్.. అసలేం జరిగింది.
ప్రపంచాన్ని ఎప్పుడూ ఉత్కంఠలో ఉంచే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రాణాల మీద మరోసారి సోషల్ మీడియాలో రకరకాల వదంతులు గుప్పుమంటున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందారంటూ చైనా డెమోక్రసీ పార్టీ చైర్మన్ వాంజున్ క్సీ సంచలన ఆరోపణలు చేశారు. కిమ్ మరణం తర్వాత ఆయన కుమార్తె కిమ్ జు-ఏ చేతికి అధికారం దక్కలేదని, ఆమె స్థానంలో కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ దేశ పగ్గాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వార్తలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
చైనా నుంచి వైద్య బృందం వెళ్లినట్లు వాంజున్ క్సీ కథనం
వాంజున్ క్సీ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లారని, ఉత్తర కొరియాలో సరైన వైద్య వసతులు లేకపోవడంతో చైనా సహాయం కోరినట్లు తెలిపారు. చైనాలోని పీకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుంచి ప్రత్యేక వైద్య నిపుణుల బృందం అక్కడికి వెళ్లిందని, మెరుగైన చికిత్స కోసం కిమ్‌ను బీజింగ్‌కు తరలించినప్పటికీ వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారని ఆయన ఆరోపించారు. కిమ్ మృతదేహాన్ని రహస్యంగా ఉత్తర కొరియాకు తరలించారని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు.

కుమార్తెకు కాకుండా సోదరికి దక్కిన పగ్గాలు?
కిమ్ జోంగ్ ఉన్ మరణం తర్వాత ఆయన వారసురాలిగా ప్రచారంలో ఉన్న కుమార్తె కిమ్ జు-ఏ చేతికి అధికారం రాలేదని, ప్రస్తుతం కిమ్ సోదరి కిమ్ యో జోంగే దేశాన్ని శాసిస్తున్నారని క్సీ ఆరోపించారు. తన అధికారాన్ని పదిలం చేసుకునేందుకు కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలను పెంచుతున్నట్లు తెలిపారు. సరిహద్దులో మైకుల ద్వారా ప్రసారాలు చేయడం, హెచ్చరిక కాల్పులు జరపడం వంటి చర్యల ద్వారా ఆమె సైన్యంపై తన పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషించారు.
ప్యాంగ్‌యాంగ్‌కు 9,000 మంది చైనా సైనికులు?
ఉత్తర కొరియాలో సంభవించబోయే అంతర్గత కల్లోలాలు, వారసత్వ పోరును అణచివేసేందుకు చైనా తన దేశం నుంచి దాదాపు 9,000 మంది సైనికులను ప్యాంగ్‌యాంగ్‌కు తరలించిందని ఆ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. చైనా పీపుల్స్ లెబరేషన్ ఆర్మీకి చెందిన నార్తర్న్ థియేటర్ కమాండ్ హై అలర్ట్ ప్రకటించిందని, సైనికుల సెలవులను రద్దు చేశారని ఆరోపించారు. అయితే ఇటు ఉత్తర కొరియా ప్రభుత్వం గానీ, అటు అంతర్జాతీయ మీడియా సంస్థలు గానీ ఈ వదంతులను ఎక్కడా ధృవీకరించలేదు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపైనా సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే, కేవలం కిమ్ జోంగ్ ఉన్ గురించే కాకుండా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై కూడా వాంజున్ క్సీ సంచలన ఆరోపణలు గుప్పించారు. గత సెప్టెంబరులో భారత్‌లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌కు హాజరైన సమయంలో జిన్‌పింగ్ స్ట్రోక్‌కు గురయ్యారని, ప్రత్యేక విమానంలో బీజింగ్‌కు చేరుకుని ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే నిరూపితం కాని ఈ కథనాలన్నింటిపై అంతర్జాతీయ వర్గాలు మాత్రం కేవలం ఊహాగానాలుగానే కొట్టిపారేస్తున్నాయి.
ఎక్స్ పోలో కనిపించిన కిమ్..
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి ఉత్తర కొరియా అధికారిక మీడియా వెంటనే స్పందించి తెరదించింది. సోమవారం ప్యాంగ్‌యాంగ్‌లో జరిగిన ఎక్స్ పో కార్యక్రమానికి కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా హాజరయ్యారు. ఆయనతో పాటు తన కుమార్తె కిమ్ జు-ఏ, సతీమణి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రదర్శనలోని స్టాళ్లను వారు కలియతిరుగుతున్న ఫోటోలను మంగళవారం ఉదయం కేసీఎన్ఏ (KCNA) అధికారిక వార్తా సంస్థ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుల పురోగతిని కిమ్ స్వయంగా పరిశీలించడంతో ఆయన మృతి చెందారన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని తేలిపోయాయి.














Click it and Unblock the Notifications
