పిల్ల కొంచెం..కూత ఘనం: అమెరికాను హెచ్చరించిన కిమ్ చెల్లి
మొన్నటివరకు అణ్వాయుధాలను విజయవంతంగా ప్రయోగిస్తూ వచ్చిన ఉత్తర కొరియా ఇక యుద్ధానికి తయారయింది. అమెరికా, దక్షిణ కొరియాలపై సైనిక చర్యకు దిగుతామంటూ కిమ్ జొంగ్ ఉన్ చెల్లెలు ప్రకటించారు.
ప్యాంగ్యాంగ్: గత ఏడాది అణ్వాయుధాల పరీక్షలతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తించింది ఉత్తర కొరియా. తన మిలటరీ సత్తాను ప్రపంచానికి తెలియజేసింది. ఇంటర్ కాంటినెంటల్ బాల్లిస్టిక్ మిస్సైల్ (ఐసీబీఎం) సహా పలు రకాల క్షిపణులను వరుసగా ప్రయోగించింది. ఆధునిక నియంతగా గుర్తింపు పొందిన ఆ దేశాధినేత కిమ్‌జొంగ్ ఉన్.. స్వయంగా వాటిని పర్యవేక్షించారు. గరిష్ఠ వేగం 6,041 కిలోమీటర్లతో ప్రయోగించే ఖండాంతర మిస్సైల్స్ ఇప్పుడు ఉత్తర కొరియా చేతిలో ఉన్నాయి.

తిరుగులేని దేశంగా..
ఇటీవలే ఉత్తర కొరియా తన అణు చట్టాలను సవరించుకుంది. అణ్వాయుధ సంపత్తిలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించేలా చట్టాలను పునఃసమీక్షించుకుంది. ఈ సెగ్మెంట్‌లో తిరుగులేని అణుశక్తిగా ఉత్తర కొరియా ఆవిర్భవించనున్నట్లు ప్రకటించుకుంది. దీని తరువాత క్షిపణి పరీక్షలు మరింత ముమ్మరం చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సైనిక విన్యాసాల్లో 150 కంటే ఎక్కువ యుద్ధ విమానాలను వినియోగించినట్లు కేసీఎన్‌ఏ స్పష్టం చేసింది.

అణ్వాయుధాలతో సమాధానం ఇస్తాం..
హ్వాసాంగ్ 17 పేరుతో ప్రయోగించిన ఐసీఎంబీ విజయవంతం- కిమ్ జొంగ్ ఉన్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని, ఏ దేశంపైనా అయినా సైనిక చర్యకు దిగేలా ప్రేరేపించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అమెరికా గానీ ఇతర ఏ దేశమైనా తమను ప్రశ్నించినా, బెదిరింపులకు దిగినా అణ్వాయుధాలతోనే సమాధానం ఇస్తామంటూ అప్పట్లోనే తేల్చి చెప్పారు కిమ్ జొంగ్. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పూర్తిస్థాయి యుద్ధాన్ని ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామనీ అన్నారు.

కిమ్ చెల్లెలు కూడా..
ఇప్పుడు తాజాగా కిమ్ జొంగ్ ఉన్ చెల్లెలు కిమ్ యో జొంగ్ కూడా అమెరికా, దక్షిణ కొరియాలకు హెచ్చరికలను జారీ చేశారు. బాంబర్-52 న్యూక్లియర్ ఫ్లైట్ ను కొరియన్ దేశాల మీదుగా ప్రయోగించిన తరువాత ఆమె తెర మీదికి వచ్చారు. అమెరికా, దక్షిణ కొరియాపై సైనిక చర్యలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అమెరికా గానీ, ఆ దేశం చేతిలో కీలుబొమ్మగా మారిన దక్షిణ కొరియా గానీ తమ దేశంపై దండెత్తడానికి ప్రయత్నిస్తే- ధీటుగా సమాధానం ఇస్తామని ప్రకటించారు.

నార్త్ ఫైరింగ్ రేంజ్..
అమెరికా, దక్షిణ కొరియా సైనిక ప్రదర్శనలు, ఆయా దేశాల కదలికలు అనుమానాస్పందగా ఉంటోన్నాయని కిమ్ యో జొంగ్ వ్యాఖ్యానించారు. నిస్సందేహంగా తాము వాటిని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. పసిఫిక్ రీజియన్ ను నార్త్ ఫైరింగ్ రేంజ్ గా మారుస్తామని, ఐసీఎంబీ టెస్ట్ ఫైరింగ్ ను అడ్డుకోవడానికి, తమను భయపెట్టడానికి అమెరికా తాజాగా బాంబర్- 52 న్యూక్లియర్ ఫ్లైట్ ను ప్రయోగించినట్లు భావిస్తోన్నామని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications