ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన లిండా; ఎలాన్ మస్క్ స్పందన ఇదే!!
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వేదిక ట్విట్టర్ నూతన సీఈఓ గా లిండా యక్కరినో బాధ్యతలు చేపట్టారు. ఈమేరకు లిండా తన లింక్డ్ఇన్ ఎకౌంట్లో తన బయో గురించిన వివరాలను అప్డేట్ చేసి, తన బయోలో ట్విట్టర్ సిఈఓ అని పేర్కొన్నారు. తాను ట్విటర్ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించినట్టు లిండా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ట్విట్టర్ భవిష్యత్తు గురించి తాను పాటుపడడానికి ఎలాన్ మస్క్ నుండి ప్రేరణ పొందినట్టుగా లిండా యక్కరినో వెల్లడించారు. ఎలాన్ మస్క్ యొక్క దూరదృష్టి తనను ఎంతో ఆకర్షించింది అని ఆమె తెలిపారు. ట్విట్టర్ ను అభివృద్ధి బాటలో నడపడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు. లిండా ఇంతకుముందు ఎన్బీసీ యూనివర్సల్ కి ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు.

ఎన్బీసీ లో ఆమె ప్రకటనల విభాగానికి డిపార్ట్మెంట్ హెడ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. మే నెలలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొత్త సిఈఓగా లిండా యక్కరినో పేరును ప్రకటించారు. అయితే ఆమె ఈ రోజు అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. లిండా యక్కరినో గురించి మాట్లాడిన ఎలాన్ మస్క్ తనకు లిండా యక్కరినో సామర్ధ్యం పై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.
ట్విట్టర్ ప్రకటనల మార్కెట్లో లిండా నూతన ఒరవడిని సృష్టిస్తారని తనకు నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక లిండా యక్కరినో తో పాటుగా ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ గా ఎన్బీసీ యూనివర్సల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన జో బెనారోక్ కూడా నేడు బాధ్యతలను స్వీకరించారు.

ఎలాన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్ వెళ్ళిన దగ్గర నుండి ఆయన అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించి ఎలాన్ మస్క్ వార్తల్లో నిలిచారు. అనేక సంచలనాలకు కూడా ఆయన కేరాఫ్ అయ్యారు. ఇక కొద్ది రోజుల పాటు ట్విట్టర్ లోగో స్థానంలో పిట్ట బొమ్మకు బదులు కుక్క బొమ్మ పెట్టి మస్క్ ప్రయోగాలు చేశారు.












Click it and Unblock the Notifications