Hrithik Roshan: హృతిక్ రోషన్ పై క్రష్: భార్యను చంపి, ఆత్మహత్య చేసుకున్న భర్త..!
న్యూయార్క్: బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ పట్ల ఉన్న విపరీతమైన అభిమానం.. ఆమె హత్యకు దారి తీసింది. భర్త చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యేలా చేసింది. భార్యను పొడిచి చంపిన తరువాత.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా భర్త. అమెరికా న్యూయార్క్ లోని క్వీన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి పేరు డొన్నె డొజొయ్. ప్రవాస భారతీయురాలు. గుజరాత్ కు చెందిన డోజో అయిదేళ్ల కిందట అమెరికా వెళ్లారు. న్యూయార్క్ లో నివసిస్తున్నారు. మూడేళ్ల కిందట ఆమెకు గుజరాత్ కే చెందిన దినేశ్వర్ బుదిహాట్ తో వివాహమైంది. వారిది ప్రేమ వివాహం.

భర్తను హృతిక్ తో పోల్చి చూస్తూ..
పెళ్లి తరువాత క్వీన్స్ ప్రాంతంలో స్థిరపడ్డారు. క్వీన్స్ లోని ఓజోన్ రోడ్ లో ఉండే జెమిని అల్ట్రా లాంజ్ లో ఆమె బార్ టెండర్ గా పని చేస్తున్నారు. హృతిక్ రోషన్ కు ఆమె వీరాభిమాని. ప్రతి రోజూ అతని గురించే కలవరిస్తుండేదట. అతని సినిమాలను విపరీతంగా చూస్తుండేదట. ఈ విషయం మీద దినేశ్వర్ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. అయినప్పటికీ.. ఆమె హృతిక్ రోషన్ పై ఉన్న అభిమానాన్ని వదలుకోలేదు. పైగా మరింత పెరిగింది. హృతిక్ రోషన్ తో భర్తను పోల్చి చూసేది. ఇది దినేశ్వర్ కు నచ్చేది కాదు. తరచూ ఆమెతో ఘర్షణ పడేవాడు.

ఇల్లొదిలి వెళ్లిన భార్య..
రెండు వారాల కిందట ఇదే విషయంపై భార్యభర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా దినేశ్వర్ కొట్టడంతో ఆగ్రహించిన డోజో.. ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. తన స్నేహితురాలైన తోటి బార్ టెండర్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండసాగారు. దీనితో డోజోపై మరింత అక్కసును పెంచుకున్నాడు దినేశ్వర్. భారత కాలమానం ప్రకారం.. శనివారం సాయంత్రం డోజోకు ఫోన్ చేశాడు. గతాన్ని మరిచి పోదామని, తనతో పాటు సినిమా చూడ్డానికి రావాలని కోరాడు. దీనితో ఆమె భర్త నివాసం ఉంటోన్న ఆల్బర్ట్ రోడ్ లోని ఓజోన్ పార్క్ అపార్ట్ మెంట్ కు వెళ్లింది.

భార్యను చంపి..మరదలికి ఎస్ఎంఎస్..
తన ఫ్లాట్ కు వచ్చిన తరువాత మరోసారి ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. కూరగాయలు తరిగే కత్తితో దినేశ్వర్ ఆమెను పొడిచి చంపాడు. ఈ విషయాన్ని డోజో చెల్లెలికి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేశాడు. డోజో మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని సూచించాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఆ తరువాత అతని ఫోన్ స్విచాఫ్ లో వచ్చింది. ఎస్ఎంఎస్ చూసిన వెంటనే డోజో చెల్లెలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు దినేశ్వర్ ఫ్లాట్ తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా..రక్తపు మడుగులో కనిపించింది డోజో.

రిసార్ట్ లో ఆత్మహత్య..
దినేశ్వర్ ఫోన్ ఏ ప్రాంతంలో స్విచాఫ్ అయిందో పోలీసులు కనుగొన్నారు. హోవర్డ్ బీచ్ సమీపంలోని ఓ రిసార్ట్ లో అతను ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వెళ్లేటప్పటికి రిసార్ట్ లోని గదిలో అతను ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. జెమిని అల్ట్రా లాంజ్ బార్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హృతిక్ రోషన్ పై అభిమానాన్ని తగ్గించుకోవాలంటూ తన భర్త తరచూ గొడవ పడుతుండేవాడని వారు వెల్లడించినట్లు తేలింది. దినేశ్వర్ సున్నిత మనస్తత్వం ఉన్నవాడని, తన భార్య తనను మాత్రమే ప్రేమించాలని కోరుకునే వాడని డోజో స్నేహితులు తెలిపారు. ఈ కారణం వల్లే ఆమెను హత్య చేసి ఉంటాడని చెప్పారు.












Click it and Unblock the Notifications