ఉక్రెయిన్ పై అణుదాడికి రష్యా రెడీ ? ప్రతీకారానికి నాటో సంసిద్ధం -మూడో ప్రపంచయుద్ధం దిశగా !
ఉక్రెయిన్ పై రష్యా దాడులు తీవ్రమవుతున్నాయి. వరుస ఎదురుదెబ్బలతో రగిలిపోతున్న రష్యా.. ఇప్పుడు ఉక్రెయిన్ పై వీలైనన్ని మార్గాల్లో కొంగొత్త ఆయుధాలతో దాడులకు దిగుతోంది. అయినా ఫలితం లేకపోవడంతో ఇక చివరికి అణ్వస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. దీంతో నాటో దేశాలు కూడా దీటుగా స్పందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మేరకు నాటో దేశాలన్నింటిలోనూ అణ్వాయుధాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.

రష్యాకు ఎదురుదెబ్బలు
ఉక్రెయిన్ తో సాగిస్తున్న పోరు ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. అయినా ఇప్పటికీ ఫలితం తేలకపోగా.. ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన పెరుగుతోంది. ఆరంభంలో ఉక్రెయిన్ పోరుకు దూరంగా ఉన్న పశ్చిమ దేశాలు, నాటో దేశాలు ఇప్పుడు క్రమంగా ఆయుధాలు అందిస్తున్నాయి. డబ్బు సాయం కూడా చేస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ రష్యాపై ప్రతిఘటనను తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ తో పోరులో భారీగా సైన్యాన్ని, ఆయుధాల్ని, మందుగుండును కోల్పోయిన రష్యాకు ఇప్పుడు పశ్చిమదేశాల నుంచి ఉక్రెయిన్ కు అందుతున్న సాయం ఆగ్రహం పెంచుతోంది.

అణు దాడికి రష్యా రెడీ
ఉక్రెయిన్ లో తగులుతున్న వరుస ఎదురుదెబ్బలతో ఆగ్రహంగా ఉన్న రష్యా..ఇప్పుడు అణుదాడికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంప్రదాయ ఆయుధాలతో ఎంతకాలం పోరాడినా లాభం లేదనే నిర్ణయానికి వచ్చిన రష్యా.. పరిమిత ఆణుదాడికి దిగవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని ఎంపిక చేసిన ప్రాంతంపై అణుదాడికి దిగడం ద్వారా తమ సత్తా చాటాలని రష్యా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉక్రెయిన్ యుద్ధంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇప్పటికే పుతిన్ పశ్చిమదేశాల్ని హెచ్చరించారు. దీంతో పశ్చిమదేశాలు అప్రమత్తం అవుతున్నాయి.

కౌంటర్ దాడికి నాటో రెడీ
రష్యా ఒకవేళ ఉక్రెయిన్ పై అణుదాడికి దిగితే దాన్ని తిప్పికొట్టేందుకు రష్యాపై అణ్వస్త్రాలు ప్రయోగించేందుకు నాటో దేశాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్రిటన్ తమ అణు వార్ హెడ్లను కీలక ప్రాంతాల్లో మోహరిస్తోంది. అక్కడి నుంచి రష్యా టార్గెట్ గా వీటిని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు వీటిని ప్రయోగించే అవకాశాలు లేవని చెప్తున్నా.. రష్యా దూకుడుని బట్టి కచ్చితంగా యూకేతో పాటు ఇతర యూరప్, నాటో దేశాలు కూడా రష్యాపై ముమ్మర దాడులకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

మూడో ప్రపంచ యుద్ధం దిశగా..
రష్యా ఉక్రెయిన్ పై అణు దాడికి దిగితే.. దానికి ప్రతిగా తాము కూడా రష్యాపై అణుదాడులకు దిగాలని బ్రిటన్ సహా నాటో దేశాలు భావిస్తున్నాయి. అయితే అణ్వస్త్ర దాడుల అనుభవాలతో దూకుడుగా నిర్ణయాలు మాత్రం తీసుకోరాదని అవి కోరుకుంటున్నాయి. కానీ తప్పనిసరి పరిస్ధితి వస్తే మాత్రం కచ్చితంగా అణ్వస్త్రాలతో విరుచుకుపడతామన్న హెచ్చరికల్ని రష్యాకు పంపాలన్న పట్టుదలతో నాటో దేశాలు కనిపిస్తున్నాయి. తద్వారా రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయాలనేది వాటి ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ రష్యా దూకుడుతో నాటో దేశాలు అణ్వస్త్రాలతో విరుచుకుపడితే మాత్రం అది కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చనే అంచనాలున్నాయి. అప్పుడు రష్యాకు మద్దతుగా చైనా వంటి అగ్రరాజ్యాలు రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications