Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మందికి పైగా భారతీయులు గల్లంతు.. కేంద్ర విదేశాంగ శాఖ కీలక ప్రకటన
భారత్ కు పొరుగు దేశమైన నేపాల్ ఇంకా వరద విలయంలోనే చిక్కుకుంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తవ్వేకొద్దీ మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 1,282 కు చేరుకుందని సమాచారం. ఇంకా 5 వేల మందికి పైగా ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. నేపాల్ పోలీసులు, రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇక ఆగస్టు 26 న నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. దాదాపు 2.56 బిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేపాల్ లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో 275 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది.
ఇప్పటి వరకూ నేపాల్ లో వరదల ధాటి నుంచి 166 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అందుకు సంబంధించిన వివరాలను విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు భారత్ లోని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. వరదల నుంచి రక్షించిన వారి పేర్లను విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ప్రకటిస్తోందని వివరించారు. ఈ మేరకు సహాయక చర్యల్లో నేపాల్ ప్రభుత్వం చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం అభినందిస్తోందని రణధీర్ జైస్వాల్ తెలిపారు.

ఇక ఇప్పటివరకూ 1,282 మందికి పైగా మృత దేహాలను వెలికి తీయగా వారిలో అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359, నవాల్ పరాసి ఈస్ట్ లో 221, నవాల్ పరాసి వెస్ట్ లో 212 మంది మృతులు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. అలాగే నువాకోట్ లో 186, రుసువా జిల్లాలో 140 మందికి పైగా మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు 13,093 మందిని సురక్షితంగా రక్షించినట్లు తెలుస్తోంది. మరోవైపు జల ప్రళయం కారణంగా రుసువా, నువాకోట్ జిల్లాల్లో దాదాపు 600 మందికి పైగా పాఠశాల విద్యార్థులు గల్లంతైనట్లు సమాచారం. రుసువాలో 280 మంది అలాగే నువాకోట్ జిల్లాలో మరో 300 నుంచి 350 మంది పిల్లల సమాచారం లభించలేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. తమ పిల్లల కోసం తల్లిదండ్రులు ఆర్తనాదాలు పెడుతున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications