russia ukrain crisis : నేడు రష్యా-ఉక్రెయిన్ చర్చలు-బెలారస్ సరిహద్దుల్లో-ఐరాస అత్యవసర భేటీ
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న వేళ అంతర్జాతీయంగా ఇరుదేశాలపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నాచితకా కారణాలతో ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యాపై ఇది తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఆర్ధిక,వాణిజ్య, గగనతల ఆంక్షలతో రష్యాను అన్నిదేశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అదే సమయంలో ఉక్రెయిన్ కూడా యుద్ధంతో తీవ్రంగా నష్టపోతోంది. భారీ ప్రాణ, ఆస్తినష్టం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా ఇచ్చిన చర్చల ఆఫర్ ను ఉక్రెయిన్ సానుకూలంగా స్వీకరించింది. దీంతో ఇవాళ చర్చలకు రంగం సిద్ధమవుతోంది.
ఉక్రెయిన్ పై ఓవైపు దాడుల్ని ముమ్మరం చేస్తున్న రష్యా వాటిని ఆపకుండానే చర్చలకు ఆఫర్ ఇచ్చింది. దీంతో భారీ ప్రాణ, ఆస్తినష్టాల్ని నివారించేందుకు ఉక్రెయిన్ కూడా చర్చలకు అంగీకరించింది. దీంతో ఇవాళ ఉక్రెయిన్ అధినేత లేదా ప్రతినిధులు, రష్యా అధినేత పుతిన్ తో బెలారస్ సరిహద్దుల్లో సమావేశమై చర్చలు జరిపే అవకాశముంది. ఈ మేరకు ఇరుదేశాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నాటో కూటమిలో చేరకుండా తటస్ధంగా ఉండే ఉక్రెయిన్ పై యుద్ధం ఆపేందుకు రష్యా సంకేతాలు ఇస్తోంది. దీంతో ఈ మేరకు హామీ ఇచ్చేందుకు ఉక్రెయిన్ కూడా సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు సఫలం కావాలని ప్రపంచదేశాలు కోరుకుంటున్నాయి.

మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా డండయాత్రపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి ఇవాళ అత్యవసర భేటీ నిర్వహిస్తోంది. ఇందులో రష్యాను కట్టడిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఐరాస సభ్యదేశాలు చర్చించబోతున్నాయి. ఇప్పటికే భద్రతామండలిలో రష్యాకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని ఆ దేశమే వీటో చేయడం, అనంతర పరిణామాలపై చర్చించి ఐరాస నుంచి రష్యాను వెలివేసే అంశాన్ని కూడా పరిశీలించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ఇప్పటికే చేసిన విజ్ఞప్తిపైనా ఐరాస సభ్యదేశాలు తమ అభిప్రాయాలు చెప్పబోతున్నాయి. అదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ చర్చలు కూడా జరిగే అవకాశం ఉండటంతో వాటి ఫలితం ఆధారంగా ఐరాస భేటీలో కీలక నిర్ణయాలు వెలువడవచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications