రష్యా సైనికులకు విషాహారం.. ఇద్దరు మృతి.. ఆస్పత్రిలో 500 మంది చికిత్స : ఉక్రెయిన్ ఆర్మీ
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లో బాంబులతో విరుచుకుపడుతోంది. క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తోంది. అటు రష్యా దళాలను ఉక్రెయిన్ ఆర్మీ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కీవ్ సైనికులకు స్థానిక పౌరులు తోడయ్యారు. మాస్కో దళాలకు చుక్కలు చూపిస్తున్నారు. రష్యా సైనికులు హస్తగతం చేసుకున్న ప్రాంతాలను తిరిగి ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను కూల్చివేస్తున్నాయి. అటు రాజధాని కీవ్, మరియుపోల్, బుచ్చా ప్రాంతాల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంది.

రష్యా సైనికులకు విషాహారం పెట్టిన ఉక్రెనియన్లు..
రష్యా సైనికులపై ఉక్రెయిన్ ఆర్మీ, స్థానిక పౌరులు వీరోచితంగా పోరాడుతున్నారు. ఖర్కిన్ ప్రాంతంలోని స్థానిక పౌరులు రష్యా సైనికులకు విషం కలిపిన " పై " అనే ఆహార పదార్ధాన్ని పంచిపెట్టారు. దాన్ని తిన్న ఇద్దరు మాస్కో సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. అంతే కాకుండా 28 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పింది. వారంతా రష్యా 3వ మోటరైజ్డ్ రైఫిల్ విభాగానికి చెందిన వారని పేర్కొంది. అటు విషపూరిత ఆల్కహాల్ తాగి మరో 500 మంది రష్యన్ సిబ్బంది ఆస్పత్రి పాలైనట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది.

ఉక్రెయిన్‌లో 18వేల మంది సైనికులు మృతి..
రష్యా బలగాలను అడ్డుకోవడంతో తాము ఏమాత్రం వెనుకడుగు వేసేది లేదని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. తమకు అందుబాబులో ఉన్న అన్ని మార్గాల ద్వారా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని తెలిపింది. తమ ప్రతిఘటనలో ఇప్పటివరకు రష్యాకు చెందిన 18వేల మంది సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. 143 యుద్ద విమానాలు, 134 హెలికాప్టర్లను నేత కూల్చినట్లు చెప్పింది. అంతే కాకుండా 644 యుద్ధ ట్యాంకులు, 1830 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 54 విమాన, క్షిపణు విధ్వంసకర వ్యవస్థలను, ఏడు యుద్ద నౌకలను పేల్చి వేసినట్లు తెలిపింది.

ఉత్తర ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలు వెనక్కి..
అటు లూహాన్స్క్ , డొనెట్స్క్ ప్రాంతాల్లో రష్యా దళాలు జరిపిన దాడులను తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ ఆర్మీ పేర్కొంది. ఈప్రతిఘటనలో నాలుగు యుద్ధ ట్యాంకులతో పాటు 13 సాయుధ వాహనాలకు ధ్వంసం చేసినట్లు తెలిపింది. మరోవైపు ఉత్తర ఉక్రెయిన్ నుంచి రష్యా తన దళాలను ఉపసంహరించుకుంది. బెలారస్‌కు వెళ్లిపోయాయని వెల్లడించింది. అంతే కాకుండా ప్రిప్యాట్ పట్టణాన్ని తమ సైనికులు తిరిగి పూర్తి స్థాయిలో స్వాధీనంలోకి తీసుకున్నారని ఉక్రెయిన్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications