Chandrayaan-3: లూనా-25ని విజయవంతంగా ప్రయోగించిన రష్యా.. చంద్రయాన్-3 కంటే ముందే ల్యాండింగ్..!
సుదీర్ఘ విరామం తర్వాత రష్యా చంద్రుడి పైకి వ్యోమనౌకను పంపింది. చంద్రుడిపైకి లునా-25 రాకెట్ ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలో వోస్తోక్నీ కాస్మో డ్రోమ్ నుంచి ఈ ప్రయోగం చేసినట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ తెలిపింది. ఈ ప్రయోగాన్ని శుక్రవారం తెల్లవారుజామున 2:10 గంటలకు నిర్వహించింది. లూనా-25 ఐదు రోజుల్లో చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత చంద్రుడి కక్ష్యలో 3 నుంచి 7 రోజులు తిరిగి దక్షిణ ధ్రువంలో దిగనుంది.
అన్ని అనుకున్నట్ల జరిగితే చంద్రయాన్-3 కంటే ముందే లూనా-25 ల్యాండర్ చంద్రుడిపై దిగనుంది. అంటే ఇది భారత్ చంద్రయాన్-3 పోటీగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. చంద్రయాన్-3 ల్యాండర్ 1,752 కిలోల బరువుతో పోలిస్తే, నాలుగు కాళ్ల రష్యన్ ల్యాండర్ 800 కిలోల బరువు ఉంటుంది. ల్యాండింగ్ విజయవంతమైతే, చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ తమ ప్రయోగాలను 14 ఎర్త్ డేస్ పాటు నిర్వహిస్తుండగా, లూనా-25 ఒక సంవత్సరం పాటు చంద్రునిపై పని చేయనుంది.

1.8 టన్నుల బరువుతో, 31 కిలోల శాస్త్రీయ పరికరాలను మోసుకెళ్లే లూనా-25 మానవ జీవితానికి తోడ్పడే ఘనీభవించిన నీటి ఉనికిని పరీక్షించడానికి 15 సెం.మీ (6 అంగుళాలు) లోతు నుండి రాతి నమూనాలను తీయడానికి ఒక స్కూప్‌ను ఉపయోగిస్తుంది. "లూనా-25 సాఫ్ట్-ల్యాండింగ్‌ను ప్రాక్టీస్ చేయాలి, మట్టి నమూనాలను తీసుకొని విశ్లేషించాలి, దీర్ఘకాలిక శాస్త్రీయ పరిశోధనలు చేయాలి" అని రష్యా అంతరిక్ష సంస్థ ప్రకటన చేసింది.
వాస్తవానికి లూనా-25ను అక్టోబర్ 2021కి ప్రయోగించాల్సి ఉండే.. కానీ దాదాపు రెండేళ్లపాటు వాయిదా పడింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన పైలట్-డి నావిగేషన్ కెమెరాను లూనా-25కి జోడించడం ద్వారా పరీక్షించాలని ప్లాన్ చేసింది. అయితే గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ప్రాజెక్ట్‌తో దాని సంబంధాలను తెంచుకుంది. అయితో చంద్రయాన్-3, లూనా-25 వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని రోస్ కాస్మోస్ తెలిపింది. దాదాపు ఒకే ల్యాండింగ్ షెడ్యూల్ ఉన్నప్పటికీ, రెండు ల్యాండింగ్ మిషన్‌లు వేర్వేరు ల్యాండింగ్ ప్రాంతాల్లో ల్యాండ్ అవుతాయని పేర్కొంది. అవి ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం లేదని స్పష్టం చేసింది. చంద్రునిపై ప్రతి ఒక్కరికీ తగినంత స్థలం ఉందని చెప్పింది.
కాగా లూనా-25 విజయవంతంగా ప్రయోగించడం పట్ల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రోస్ కాస్మోస్ కు శుభాకాంక్షలు తెలిపింది. చంద్రయాన్-3, లూనా-25 తమ లక్ష్యాలను చేరుకోవాలని ఇస్రో కోరుకుంది.












Click it and Unblock the Notifications