బంగ్లాదేశ్ రిటర్న్ కు సిద్దమైన హసీనా..! తొలి అడుగు..! అంతలోనే ట్విస్ట్..!
రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో విద్యార్ధి ఉద్యమంలో పదవీచ్యుతురాలైన తర్వాత పారిపోయి వచ్చి భారత్ లో శరణార్దిగా ఉంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) ఇప్పుడు తిరుగుముఖం పట్టేందుకు సిద్ధమవుతున్నవారు. ఆరు నెలల క్రితమే ఈ డిసెంబర్ లో స్వదేశానికి వెళ్లిపోతానని, అక్కడ తనకు విధించే మరణశిక్షకు భయపడేది లేదని ప్రకటించిన హసీనా.. అన్నట్లుగానే ఈ దిశగా తొలి అడుగు వేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని బంగ్లా ఎంబసీని సంప్రదించారు.
ప్రస్తుతం ఢిల్లీలోని ఓ అజ్ఞాత ప్రదేశంలో తలదాచుకుంటున్న షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తనకు కొత్త పాస్ పోర్టు, బంగ్లా జాతీయ గుర్తింపు కార్డు ప్రయాణపత్రాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ ఎంబసీలో తన లాయర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వం, ఇతర అధికారులు ఆమె ప్రస్తుత బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డుని రద్దు చేసినట్లు వచ్చిన వార్తల దృష్ట్యా, తమ క్లయింట్‌కు కొత్త బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డును జారీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తాత్కాలిక హైకమిషనర్ ప్రీతి రెహమాన్ ను రాసిన లేఖలో లాయర్లు కోరారు.

అయితే బంగ్లాదేశ్ విదేశాంగశాఖ సహాయమంత్రి హుమాయున్ కబీర్ మాత్రం ఆమెకు ఇవన్నీ ఇచ్చే బదులు తమకు అప్పగించాలని కోరారు. హసీనాను తమకు అప్పగించాలని, ఆమె ఒక ఉగ్రవాది అని మంత్రి హుమాయున్ కబీర్ అభివర్ణించారు. ఆమె పరారీలో ఉన్న వ్యక్తి అన్నారు. బంగ్లాదేశ్, భారతదేశం మధ్య ప్రస్తుతం అమలులో ఉన్న అప్పగింత ఒప్పందం ఉందన్నారు. పాస్‌పోర్ట్ అవసరాన్ని తోసిపుచ్చుతూ, ఇప్పటికే ఉన్న అప్పగింత నిబంధనల ద్వారానే ఆమెను తిరిగి తీసుకురావాలని తెలిపారు. దీంతో బంగ్లాదేశ్ ఆమెకు పాస్ పోర్టు జారీ చేస్తుందా లేక నేరుగా భారత్ అప్పగించాలని కోరబోతోందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భారత్ కు బంగ్లాదేశ్ ఈ మేరకు హసీనాను అప్పగించాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసిన విషయాన్ని తాజాగా కూడా గుర్తుచేసింది.














Click it and Unblock the Notifications
