ట్రంప్ వార్నింగ్ నే లెక్కచేయని తాలిబన్లు- ఏం చేసుకుంటారో..!
ఒకప్పుడు బిన్ లాడెన్ పేరు చెప్పి ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరోక్షంగా పాలించిన అమెరికాకు ఇప్పుడు భంగపాటు ఎదురైంది. ఆప్ఘనిస్తాన్ లో అమెరికా మద్దతున్న ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు గతంలో జరిగిన తప్పిదాల్ని సవరించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా అమెరికాకు భారీ షాకిచ్చారు.
ఒకప్పుడు ఆప్ఘనిస్తాన్ లోని బగ్రామ్ ఎయిర్ బేస్ ను తమ స్థావరంగా మార్చుకుని ఆ దేశంపై పట్టు సాధించి, ఇతర దేశాలపై దాడులు చేసిన అమెరికా.. 20 ఏళ్ల తర్వాత దాన్ని వదిలేసి వెళ్లిపోయింది. అయితే తాజాగా దాన్ని తిరిగి తమకు ఇవ్వాలని కోరుతోంది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు బగ్రామ్ ఎయిర్ బేస్ ఇవ్వాలని, దానికి ప్రతిగా ఇతర ప్రయోజనాలు కల్పించేలా డీల్ చేసుకొందామని ట్రంప్ ఆప్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వానికి ఆఫర్ చేశారు.

దీనిపై తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బాగ్రామ్ వైమానిక స్థావరంపై ఒప్పందం సాధ్యం కాదని ఆఫ్ఘన్ ప్రభుత్వ రక్షణ అధికారి తేల్చిచెప్పేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ యుఎస్ స్థావరాన్ని తిరిగి కోరుకుంటున్నారని, కానీ అంగుళం భూమి కూడా వారికి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దానిని తిరిగి ఇవ్వకపోతే ఆఫ్ఘనిస్తాన్‌పై చెప్పలేని శిక్షను విధించనున్నట్లు ట్రంప్ బెదిరించారు. దీన్ని తాలిబాన్లు తోసిపుచ్చారు.

ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫసిహుద్దీన్ ఫిత్రాత్ మాట్లాడుతూ కొంతమంది రాజకీయ ఒప్పందం ద్వారా బగ్రాన్ ఎయిర్ బేస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని తెలిపారు. కానీ వారి బెదిరింపులకు లొంగేది లేదన్నారు.
రాజధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లోని అతిపెద్ద వైమానిక స్థావరం బాగ్రామ్. తాలిబాన్‌లతో 20 సంవత్సరాల యుద్ధంలో అమెరికా కార్యకలాపాలకు ఇది కేంద్రంగా ఉంది.












Click it and Unblock the Notifications