ఆమెకు రొటీన్ అంటే బోర్.. ఆరేళ్లుగా పిల్లి, తనూ...
చదువు పూర్తయ్యాక వెంటనే మొదలయ్యే ఆలోచనేంటి.. ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం. కానీ కాలీఫోర్నియాకి చెందిన లిజ్ క్లార్క్ అందరిలా ఆలోచించలేదు. ఓ బుల్లి పిల్లిని వెంటేసుకుని సముద్రయానం ద్వారా ప్రపంచాన్ని వీక్షించడానికి బయలుదేరింది. చదువుకునే సమయంలో కూడబెట్టిన డబ్బుతో ఈ ప్రయాణం మొదలుపెట్టింది లిజ్. ఇప్పుడు ఆమె వయసు 32 ఏళ్లు. తన ప్రయాణం మొదలయ్యి ఇప్పటికీ ఆరేళ్లు. ఆరు నెలల వయసప్పుడు తనతో పాటు వెంట తెచ్చుకున్న పిల్లికి ఇప్పుడు ఆరు సంవత్సరాల ఆరు నెలలు.
బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సముద్రయానాన్ని ఆస్వాదిస్తూ వెళ్తున్న లిజ్.. పుట్టింది పెరిగింది కాలిఫోర్నియాలోని శాండియాగో లో. చిన్నప్పటినుండే సముద్రయానంపై మక్కువ పెంచుకున్న లిజ్, తన చదువు పూర్తవగానే 1960 లలో తయారుచేసిన 40 అడుగల పొడవు, 11 అడుగుల వెడల్పు గల పాత బోట్ ఒకదాన్ని కొనుక్కుని.. అమేలియా అనే ఓ బుల్లి పిల్లిని వెంటేసుకుని సముద్రంలో షికారుకు బయలుదేరింది.
రొటీన్ జీవితాల్ని అంతగా ఇష్టపడని లిజ్ రొటీన్ కి భిన్నంగా ఇలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. నిజానికి లిజ్ ప్రపంచాన్ని చుట్టి రావాలనుకుంటే విమానాల ద్వారాను ఆ పని చేసి ఉండొచ్చు, కానీ లిజ్ ఉద్దేశ్యం వేరు. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించొద్దనే ఉద్దేశ్యంతోనే లిజ్ సముద్రయానానికి శ్రీకారం చుట్టింది. కాలిఫోర్నియా తీరం నుంచి తన యాత్రను ప్రారంభించిన లిజ్ ప్రస్తుత ప్రయాణం.. మెక్సికో దక్షిణ తీరం, మధ్య అమెరికా, ఉత్తర ఫసిఫిక్ ల గుండా సాగిపోతోంది.
ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన యాత్ర వివరాలను వెల్లడిస్తున్న లిజ్.. తన యాత్ర కొనసాగడానికి ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని కోరింది. తన వెంట తెచ్చుకున్న డబ్బంతా అయిపోవడంతో తన కల నెరవేరడానికి ఎవరైనా స్పాన్సర్లు ముందుకు రావాలని ట్రావెల్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది లిజ్.