TikToK ఈజ్ బ్యాక్
Donald Trump's swearing-in ceremony: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొన్ని గంటలే మిగిలివుంది. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
గత ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌ను చిత్తు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వెస్ట్ ఫ్రంట్‌కు బదులుగా కేపిటల్ వన్ ఎరినాలోకి మారిందీ కార్యక్రమం.

తాజాగా కేపిటల్ వన్ ఎరీనాలో ఏర్పాటు చేసిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA) విజయోత్సవ సభలో ప్రసంగించారు డొనాల్డ్ ట్రంప్. ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు ఈ కార్యక్రమం ఏర్పాటైంది. టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఇందులో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మరో ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్. టిక్ టాక్ సేవలను పునరుద్ధరిస్తాననీ హామీ ఇచ్చారు. టిక్ టాక్ ఈజ్ బ్యాక్ అని చెప్పారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తానని పేర్కొన్నారు.
టిక్‌టాక్‌ను అమెరికా నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై ఆ యాప్ మాతృసంస్థ బైట్ డాన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. అక్కడి కోర్టు బ్యాన్ నిర్ణయాన్ని సమర్థించింది. ఆదివారం నుంచే ఈ చట్టం అమలులోకి రావడం వల్ల 14 గంటల పాటు టిక్ టాక్ షట్‌డౌన్ అయింది కూడా.
ఆ కొద్దిసేపటికే డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్‌కు అనుకూలంగా ప్రకటన చేశారు. నిషేధాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ యాప్‌ను విక్రయించడానికి బైట్‌డాన్స్‌కు మరింత గడువు ఇస్తానని పేర్కొన్నారు. యూఎస్ కంపెనీ జాయింట్ వెంచర్‌గా 50 శాతం వాటాను టిక్ టాక్ మాతృసంస్థలో కలిగి ఉంటుందని చెప్పారు.

దీనికోసం యూఎస్ కంపెనీలో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి బైట్ డాన్స్ ప్లాట్‌ఫామ్‌కు మరింత గడువు ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్లు ఆయన టీమ్ నిర్దారించింది. ఈ విషయాన్ని ట్రంప్ సలహాదారు జాసన్ మిల్లర్ సీఎన్ఎన్‌కు వెల్లడించారు. ఈ నిషేధాన్ని 90 రోజుల వరకు తాత్కాలికంగా రద్దు చేసే అవకాశం అధ్యక్షుడికి ఉంటుందని సీఎన్ఎన్ పేర్కొంది.
ఈ ప్రకటన వెలువడిన తరువాత బైట్ డాన్స్ యాజమాన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది. టిక్ టాక్ యాప్ సేవలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంది. అదికారికంగా ఆదేశాలు వెలువడిన వెంటనే దీని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సానుకూలంగా స్పందించినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు టిక్ టాక్ సీఈఓ షుయ్ చివ్.












Click it and Unblock the Notifications