వెనిజులా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్..: షాకింగ్ పోస్ట్
అమెరికా సైనికచర్య అనంతరం వెనిజులాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకోవడం, ఆయనను న్యూయార్క్ తరలించడంతో అక్కడి ప్రభుత్వంలో భారీ మార్పులు సంభవించాయి. వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు వెనిజులా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది.
అమెరికా దళాల ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్న అధ్యక్షుడు నికోలస్ మదురో అందుబాటులో లేని సమయంలో, ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాలని సూచించింది. పరిపాలన నిరంతరాయంగా సాగేలా చూడటానికి, దేశ సమగ్ర రక్షణకు భరోసా ఇవ్వడానికి బోలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా అధ్యక్ష పదవిని రోడ్రిగెజ్ చేపట్టనున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

అధ్యక్షుడి బలవంతపు గైర్హాజరీలో దేశ, ప్రభుత్వ పరిపాలన, సార్వభౌమత్వాన్ని రక్షించడానికి వర్తించే చట్టపరమైన నిబంధనలను నిర్ధారించడానికి త్వరలో చర్చించనున్నట్లు తీర్పు పేర్కొంది. పాలన సజావుగా కొనసాగడానికి, రక్షణపరమైన వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుతో వెనిజులా రాజకీయాల్లో కొత్త అధ్యాయం ఆరంభమైనట్టయింది.
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సంచలనానికి తెర తీశారు. తనను తాను వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ఒకవంక అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతూనే 2026 జనవరి నుంచి కొత్తగా వెనిజులా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించినట్లు వెల్లడించారు. ఇది- ప్రపంచ దేశాలను షాక్ కు గురి చేసింది.












Click it and Unblock the Notifications