H1B Visa వ్యవహారంపై క్షమించండి..!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి H1B Visa ఫీజు పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ఫీజును పెంచడం వల్ల విదేశీ నిపుణుల కొరత ఏర్పడుతోందని అంగీకరించారు. ఇక్కడ చిప్ మేకింగ్ ప్లాంట్లను నిర్మిస్తున్న కంపెనీలకు విదేశీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అవసరమౌతారని, ప్రస్తుతం తమ దేశంలో ఇటువంటి నిపుణులు లేరని అన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు విదేశీ కార్మికుల అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
వాషింగ్టన్ డీసీలో యూఎస్-సౌదీ అరేబియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌ను ఉద్దేశించిన ట్రంప్ మాట్లాడారు. H1-B Visa లపై విదేశీ కార్మికులను స్వాగతించడం మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్‌లో భాగమేనని అన్నారు. కొన్ని రకాల ఉద్యోగాలకు సరైన, అర్హత కలిగిన వారు అమెరికాలో దొరకట్లేదని తేల్చి చెప్పారు. ఈ విషయం మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ మద్దతుదారులకు రుచించట్లేదని వ్యాఖ్యానించారు. వాళ్లు దీన్ని అర్థం చేసుకోలేరని చురకలు అంటించారు.

"బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టే కంపెనీలు తమ ప్లాంట్‌ను ప్రారంభించడానికి, నడపడానికి తమ దేశం నుండి చాలా మందిని తీసుకురావడానికి అనుమతించకపోతే మనం విజయం సాధించలేం.. క్షమించండి." అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇదివరకు ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించానని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికాలో తగినంత మానవ వనరులు లేనందున విదేశీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అవసరమని అన్నందుకు తనను విమర్శించడం సరికాదని చెప్పారు.
నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ ను అమెరికాలోకి అనుమతించడం అవసరమని, తద్వారా వారు ఇక్కడి వారికి శిక్షణ ఇవ్వగలరని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. అరిజోనాలోని కంప్యూటర్ చిప్ తయారీ ప్లాంట్‌ను ఉదాహరించారు. విదేశీ పెట్టుబడులు, సిబ్బంది లేకుండా అలాంటి కార్యకలాపాలను నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. విదేశీ నిపుణులను స్వాగతిస్తానని తేల్చి చెప్పారు. వాళ్లు అమెరికన్లకు కంప్యూటర్ చిప్స్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తారని, తక్కువ సమయంలో, గొప్పగా పని చేస్తారని వ్యాఖ్యానించారు.
జార్జియాలో హ్యుందాయ్ ప్లాంట్‌లో పనిచేస్తున్న డజన్ల కొద్దీ దక్షిణ కొరియా కార్మికులను ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్న సందర్భాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఆ కార్మికులను దేశం నుంచి పంపించకూడదని తాను కోరుకున్నట్లు తెలిపారు. వలసదారుల వల్ల అమెరికన్ గ్రాడ్యుయేట్లను ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల నుండి దూరం చేస్తున్నారనే ఆందోళన ఉందని, దీన్ని పరిష్కరించడానికి తగిన నిర్ణయాలను తీసుకుంటానని అన్నారు.












Click it and Unblock the Notifications