అమెరికా- ఇరాన్ మధ్య సడన్ సీజ్ ఫైర్: 10 పాయింట్స్ ఫార్ములా
అయిదువారాల పాటు ఏకధాటిగా కొనసాగిన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది. రెండు వారాల పాటు సీజ్ ఫైర్ కు ఆయా దేశాలు అంగీకరించాయి. ఆ వెంటనే దౌత్య ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇరాన్ పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపిన 10 సూత్రాల ప్రతిపాదనపై ఈ నెల 10న ఇస్లామాబాద్‌లో ఇరు పక్షాలు చర్చించనున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలకు రంగం సిద్ధమైందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది.
ఈ చర్చలు- ఉద్రిక్తతలను తగ్గించడం లేదా యుద్ధానికి ముగింపు కాదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తేల్చి చెప్పింది. తమ చేతులు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని, ఏ పొరపాటు జరిగినా కూడా పూర్తి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణను ఇరాన్ తమ విజయంగా అభివర్ణించింది. అమెరికా అంగీకరించేలా చేశామని ప్రకటించుకుంది.

ఇస్లామాబాద్ లో ఈ చర్చలు 15 రోజులు కొనసాగవచ్చని, అవసరమైతే పొడిగించవచ్చని అంచనా. ఓ సమగ్ర ఒప్పంద ముసాయిదాను ఖరారు చేయడమే దీని ఉద్దేశం. కాల్పుల విరమణ సమయంలో సముద్ర మార్గాలలో పరిమిత సహకారం ఉంటుందని, ఇరానియన్ సాయుధ దళాల సమన్వయంతో హోర్ముజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణాన్ని చేస్తామని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పేర్కొంది.
ఇరాన్ అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే కాల్పుల విరమణ అధికారికంగా అమల్లోకి వస్తుందని వైట్‌హౌస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తర్వాత, రెండు వారాల కాల్పుల విరమణకు పాకిస్తాన్ ప్రతిపాదనను టెహ్రాన్ అంగీకరించిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ముగ్గురు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా కాల్పుల విరమణను ఆమోదించారు. ఇరాన్‌పై దాడులు ఆగిపోతే, తాము కూడా నిలిపివేస్తామని, కాల్పుల విరమణ సమయంలో ఇరానియన్ సాయుధ దళాల సమన్వయంతో హోర్ముజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణాన్ని కల్పిస్తామని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అన్నారు. కాల్పుల విరమణ అమలు చేసినందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సైనిక అధిపతి అసిమ్ మునీర్‌ల పట్ల ఆయన ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇరాన్ ప్రతిపాదనలో మొత్తం 10 కీలక అంశాలు:
1. ఎట్టి పరిస్థితుల్లోనూ పరస్పర దాడులకు దిగకూడదు.
2. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగింపు
3. యురేనియం సుసంపన్నతకు అంగీకారం
4. అన్ని రకాల ప్రాథమిక, ద్వితీయ ఆంక్షల రద్దు.
5. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి,
6. బోర్డు ఆఫ్ గవర్నర్స్ తీర్మానాల రద్దు.
7. ఇరాన్‌కు పరిహారం చెల్లింపు.
8. ఈ రీజియన్ నుండి అమెరికా సాయుధ బలగాల ఉపసంహరణ.
9. లెబనాన్‌లోని హిజ్‌బుల్లాతో కాల్పుల విరమణ
10. అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాల బేస్ క్యాంపుల తొలగింపు












Click it and Unblock the Notifications