వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Hajj యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కాబా

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది ఎంతో మంది హజ్ యాత్రకు వెళ్తుంటారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ప్రతి ఏడాది వేలల్లో ముస్లింలు సౌదీకి హజ్ యాత్ర చేస్తుంటారు.

కానీ కరోనా ఆంక్షల వల్ల ఈ ఏడాది హజ్‌కు వచ్చే వారి సంఖ్యను సౌదీ అరేబియా తగ్గించింది. ఈ ఏడాది హైదరాబాద్ నుంచి సుమారు 3,081 మంది హజ్‌కు వెళ్లారని తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ తెలిపింది. వీరిలో తెలంగాణ నుంచి 2,171 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 910 మంది ఉన్నారు.

భారత్ నుంచి మాత్రమే కాదు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది ముస్లింలు హజ్ కోసం సౌదీ అరేబియా చేరుకుంటారు. కరోనా సంక్షోభంతో గత రెండు సంవత్సరాలు హజ్ యాత్రకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా కొన్ని ఆంక్షల మధ్యే అనుమతులు జారీ చేశారు.

కాబా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

హజ్ అంటే ఏమిటి?

ఇస్లాం ప్రకారం ప్రతి ముస్లిం నిర్వర్తించాల్సిన అయిదు బాధ్యతల్లో హజ్ యాత్ర ఒకటి. కల్మ, రోజా, నమాజ్, జకాత్ అనేవి మిగతా నాలుగు బాధ్యతలు.

ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగా ఉన్న ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్‌ యాత్ర చేయాలనేది ఇస్లాం మత విశ్వాసం. అల్లా ఆదేశాల మేరకు ఇబ్రహీం ప్రవక్త హజ్ కోసం పిలుపునిచ్చారని ఇస్లాం చెబుతోంది.

ఇస్లాం ప్రకారం... ఇబ్రహీం ప్రవక్త, ఆయన కుమారుడు ఇస్మాయిల్ కాబా అనే రాయిని తయారు చేశారు. ఆ తరువాత అక్కడి ప్రజలు మెల్లగా అనేక మంది దేవుళ్లను ఆరాధించడం ప్రారంభించారు. విగ్రహాలు పెట్టడం కూడా మొదలైంది. దాంతో కాబా వద్ద తనను మాత్రమే ఆరాధించేలా చేయమంటూ మహ్మద్ ప్రవక్తను అల్లా ఆదేశించారు.

క్రీ.శ.628లో 1,400 మంది అనుచరులతో కలిసి మహ్మద్ ప్రవక్త కాబాకు బయలుదేరారు. ఇస్లాం ప్రకారం ఇదే తొలి తీర్థ యాత్ర. దీనినే హజ్ యాత్ర అంటారు.

ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు హజ్ కోసం మక్కాకు చేరుకుంటారు. ఈ యాత్ర అయిదురోజుల పాటు జరుగుతుంది. బక్రీదు రోజున ముగుస్తుంది.

భారత్ నుంచి 79,237 మంది

ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది హజ్ కోసం సౌదీ అరేబియాకు వచ్చి ఉంటారని అంచనా. గతంలో కరోనా సంక్షోభం వల్ల విదేశీ ముస్లింలకు సౌదీ అరేబియా అవకాశం ఇవ్వలేదు. కరోనాకు ముందు 2019లో సుమారు 25 లక్షల మంది హజ్‌ కోసం మక్కా వెళ్లారు.

కానీ ఈసారి హజ్ యాత్రకు సంబంధించి భారత్‌ కోటా 79,237 మాత్రమే. రెండేళ్ల తరువాత భారతీయులు హజ్‌ చేస్తున్నారు.

ఏయే దేశాల నుంచి వస్తారు?

అనేక దేశాల నుంచి ముస్లింలు హజ్ కోసం మక్కాకు వస్తారు. ఇండోనేసియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, ఇరాన్, టర్కీ, ఈజిప్టు, ఇథియోపియా వంటి దేశాల నుంచి సౌదీ అరేబియాకు వెళ్తారు.

హజ్‌లో భాగంగా ఏ చేస్తారు?

హజ్ చేసే యాత్రికులు తొలుత సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సులో మక్కాకు వెళ్తారు. మక్కాకు 8 కిలోమీటర్ల బయట ఉండే మికత్ నుంచి హజ్ యాత్ర మొదలవుతుంది. మక్కాలోకి ప్రవేశించే ముందు దేహాన్ని శుభ్రపరచుకోవడం, తెల్లని దుస్తులు ధరించడం వంటివి ఇక్కడ చేస్తారు.

తెల్లని వస్త్రాల్లో హజ్ యాత్రికుడు

అహ్రాం

హజ్ యాత్రకు వెళ్లిన ముస్లింలు, మక్కాలోకి ప్రవేశించే ముందు తెల్లని వస్త్రాన్ని ధరిస్తారు. దాన్నే అహ్రాం అంటారు. ఈ తెల్లని వస్త్రాన్ని కుట్టరు. మహిళలు అహ్రాం ధరించాల్సిన అవసరం లేదు. వారు తెల్లని సంప్రదాయ దుస్తులు ధరించి, తలకు హిజాబ్ చుట్టుకుంటే సరిపోతుంది.

ప్రార్థనలు చేస్తున్న ముస్లిం మహిళ

ఉమ్రా

మక్కాకు చేరుకున్న తరువాత ముస్లింలు చేసే తొలి పని ఉమ్రా. ఇదొక ఆధ్యాత్మిక యాత్ర. ఇది ఏడాదిలో ఎప్పుడైనా చేయొచ్చు. తప్పనిసరి కాకపోయినా హజ్‌లో భాగంగా ఉమ్రాను ముస్లింలు చేస్తుంటారు. కాబా చుట్టూ ప్రదక్షిణలు చేయడం, దాన్ని ముట్టుకోవడం, ప్రార్థనలు చేయడం వంటివి ఉమ్రాలో భాగంగా ఉంటాయి.

అరాఫత్ పర్వతం

మీనా యాత్ర

ఇస్లామిక్ నెల జిల్-హిజ్ 8వ రోజున హజ్ ప్రారంభమవుతుంది. 8న హజీలు మీనా పట్టణానికి వెళ్తారు. ఇది మక్కాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 8న రాత్రి మీనాలోనే హజీలు గడుపుతారు. మరుసటి రోజు అంటే 9వ తేదీ ఉదయం అరాఫత్ మైదానం చేరుకుంటారు.

తాము చేసిన పాపాలను క్షమించమని అరాఫత్ మైదానంలో నిలబడి హజీలు అల్లాను వేడుకుంటారు. 9వ తేదీ సాయంత్రానికి ముజదల్ఫా నగరానికి హజీలు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉంటారు. 10వ తేదీ పొద్దున తిరిగి మీనాకు చేరుకుంటారు.

జమారత్‌లో భాగంగా రాళ్లతో కొట్టే పిల్లర్

జమారత్

సైతాన్‌ను రాళ్లతో కొట్టడాన్ని జమారత్ అంటారు. మీనాలో ఉండే జమ్రా పిల్లర్ల వద్దకు చేరుకుని వాటిని హజీలు రాళ్లతో కొడతారు. అక్కడే మేక లేదా గొర్రెను బలి ఇస్తారు. ఆ తరువాత మగవారు గుండు చేయించుకుంటారు. ఆడవారు కొంత జుట్టును సమర్పిస్తారు.

ఈద్ ఉల్ అజహా

జమారత్ తరువాత తిరిగి హజీలు మక్కాకు వస్తారు. కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్నే తవాఫ్ అంటారు. జిల్-హిజ్ 10వ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలు ఈద్ ఉల్ అజహా లేదా బక్రీద్ జరుపుకుంటారు.

తవాప్ తరువాత యాత్రికులు మళ్లీ మీనాకు వెళ్లి అక్కడ రెండు రోజులుంటారు. జిల్-హిజ్ 12వ రోజున చివరసారి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రార్థిస్తారు. దాంతో హజ్ యాత్ర ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What do Muslims do when they go on Hajj?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X