కరోనావైరస్ మరో కొత్త వేరియంట్ కలకలం: డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ కొత్త వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి. తాజాగా, అమెరికాలో కోవిడ్ 19కి చెందిన కొత్త వేరియంట్ గుర్తించారు. ఈ వేరియంట్‌ను బీఏ.2.86(BA.2.86)పేర్కొన్నారు. దీనిని అమెరికాతోపాటు డెన్మార్క్, ఇజ్రాయెల్‌లోనూ కనుగొన్నారు. దీంతో అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం(CDC) అప్రమత్తమైంది.
ఈ కరోనా కొత్త వేరియంట్‌ను ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ కొత్త రకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని.. కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. ఈ బీఏ.2.86 కొత్త రకానికి సంబంధించి అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) స్పందించింది.

ఈ వేరియంట్‌లో భారీ సంఖ్యలో ఉత్పరివర్తనాలు చోటు చేసుకుంటున్నందున.. ప్రస్తుతం దీన్ని వేరియంట్ అండర్ మానిటరింగ్ గా పేర్కొన్నామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ రకానికి చెందిన సీక్వెన్స్ లు కొన్ని దేశాల్లోనే వెలుగు చూశాయని.. ప్రస్తుతం మూడు వేరియంట్ ఆఫ్ ఇంటెరెస్ట్‌లతోపాటు ఏడు వేరియంట్స్ అండర్ మానిటరింగ్‌లను ట్రాకింగ్ చేస్తున్నట్లు తెలిపింది.
ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి, తీవ్రతను అర్థం చేసుకునేందుకు మరింత సమాచారం అవసరమని, దీనిపై ప్రపంచ దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటున్నట్లు పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ ప్రస్తుతం 10 వేరియంట్లను పర్యవేక్షిస్తోంది.
కరోనావైరస్ ఆరోగ్య అత్యయిక స్థితి కాకున్నా.. ప్రపంచానికి ఇదొక ముప్పేనని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయేసస్ తెలిపారు. కొత్తగా గుర్తించిన బీఏ.2.86 వేరియంట్ ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నామన్నారు. గుజరాత్‌లో జరుగుతోన్న జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగా వెలుగుచూస్తున్న వేరియంట్లలో ఎన్నో పరివర్తనాలు ఉన్నాయన్నారు. దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇలాంటి కొత్త వేరియంట్లు గుర్తు చేస్తున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications