Bharat Biotech: కోవాగ్జిన్‌కు అనుమతి ఇవ్వని ప్రపంచ ఆరోగ్య సంస్థ: పెండింగ్‌లోనే
జెనీవా: హైదరాబాద్‌కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్‌కు ఊరట లభించట్లేదు. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి అవసరమై అనుమతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంజూరు చేయలేదు. మరింత అదనపు సమాచారాన్ని అందజేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశించింది. వాటిని పరిశీలించిన తరువాతే- తుది నిర్ణయాన్ని తీసుకుంటామని స్పష్టం చేసింది.

డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి పొందిన వ్యాక్సిన్లు..
కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా పరిమితంగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్, రష్యా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూపొందించిన స్పుత్నిక్ వీ, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, చైనా అభివృద్ధి చేసిన సినోఫామ్ టీకాలను వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినియోగిస్తోన్నాయి ఆయా దేశాలన్నీ.

కోవిషీల్డ్.. కోవాగ్జిన్
భారత్‌లో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ అత్యధికంగా వినియోగమౌతోంది. స్పుత్నిక్ వీ వాటా పరిమితంగా ఉంటోంది. వాటన్నింటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులను మంజూరు చేసింది. ఒక్క కోవాగ్జిన్ మినహాయించి. ప్రపంచంలో ఏ దేశానికైనా వాటిని ఎగుమతి చేయడానికి ఈ ఎమర్జెన్సీ లిస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వ్యాక్సిన్లను డబ్ల్యూహెచ్‌ఓ కొనుగోలు చేసి.. పేద దేశాలకు సరఫరా చేస్తుంటుంది.

ఈయూఎల్‌లో..
ప్రస్తుతం కోవాగ్జిన్‌కు ఈ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్)లో చోటు దక్కలేదు. దీనికోసం భారత్ బయోటెక్ యాజమాన్యం తన వంతు ప్రయత్నాలను సాగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన కోవాగ్జిన్‌కు సంబంధించిన పూర్తి క్లినికల్ డేటా, రీసెర్చ్ డాక్యుమెంట్లు, ఇదివరకు నిర్వహించిన ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను భారత్ బయోటెక్ యాజమాన్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేసింది.

ట్యాగ్ భేటీ..
దీనిపై అధ్యయనం చేయడానికి మంగళవారం డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సమావేశమైంది. డాక్యుమెంట్లను పరిశీలించింది. అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించింది. భారత్ బయోటెక్ పంపించిన సమాచారం అసమగ్రంగా ఉందని పేర్కొంది. మరింత అదనపు సమాచారాన్ని అందజేయాలని సూచించింది. రిస్క్-బెనిఫిట్ అసెస్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం మరింత కావాలని పేర్కొంది. తాము అడిగిన సమాచారం ఇంకా రాలేదని తెలిపింది.

అసంపూర్తిగా..
కాగా- ఈ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్.. నవంబర్ 3వ తేదీన మరోసారి సమావేశం కానుంది. ఈలోగా భారత్ బయోటెక్ యాజమాన్యం.. ఈ సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓకు అందజేయాల్సి ఉంటుంది. అదే చివరి అసెస్‌మెంట్ అవుతుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. తాము అడిగిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటే.. టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సంతృప్తిని వ్యక్తం చేస్తే- 24 గంటల వ్యవధిలో కోవాగ్జిన్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్‌కు అనుమతి ఇస్తామని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి డాక్టర్ మార్గరెట్ హ్యారిస్ తెలిపారు.
Recommended Video

77.8 శాతం ఎఫీషియన్సీ..
కరోనా వైరస్‌పై కోవాగ్జిన్ 77.8 శాతం సామర్థ్యంతో కోవాగ్జిన్ పని చేస్తుందంటూ ఇదివరకు క్లినికల్ ట్రయల్స్ నిర్ధారణ చేశాయి. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌పై ఇది 65.2 శాతం మేర ప్రభావం చూపుతుందని తేలింది. కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు లభిస్తాయని ఆశించినప్పటికీ.. దీనికి విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. మళ్లీ భారత్ బయోటెక్ యాజమాన్యం.. ఈ అదనపు సమాచారాన్ని అందజేయాల్సి ఉంటుంది. దీనిపై నవంబర్ 3వ తేదీన ఈ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ మరోసారి భేటీ అవుతుంది.












Click it and Unblock the Notifications