ఆ జిల్లాలో అఘోరాల హల్ చల్ .... నూతన సర్పంచ్ లే టార్గెట్
చూడగానే భయం కలిగించే రూపం, జుగుప్స కలిగించేలా బట్టలు లేకుండా నగ్న దేహం,ఒళ్లంతా బూడిద, పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్న ఓ అఘోరా కరీంనగర్ జిల్లాలో హల్ చల్ చేస్తున్నారు. అఘోరాను చూసిన జనాలు భయంతో వణికిపోతున్నారు . బట్టలు లేని ఆ నగ్న సాధువు వెనుక మరో ఇద్దరు వీధుల్లో సంచరిస్తూ అందర్నీ హఢలెత్తించారు. అఘోరాకు డబ్బులు ఇవ్వాలని వారు సర్పంచ్ లను డిమాండ్ చేస్తూ జిల్లాలో తిరుగుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో నాగసాధువుల పేరుతో గత కొద్దిరోజులుగా పలువురు హల్చల్ చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ను టార్గెట్ చేస్తూ పూజలు నిర్వహిస్తారు. డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే అఘోరా ఘోరంగా శపిస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో భయాందోళనకు గురవుతున్న సర్పంచ్ లు అలాగే నాగ సాధువుకు ముడుపులు చెల్లించుకుంటున్నారు. ఎవరైనా మీరెవరు, ఎందుకు వచ్చారు అని గట్టిగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తే తిరగబడుతున్నారు. మా జోలికి వస్తే చూపిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఈ అఘోర వ్యవహారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.

ఉత్తర్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనంలో ఒకతను బట్టలు లేకుండా..మరో ఇద్దరు కాషాయ దుస్తులు ధరించి తిరిగారు. రామడుగు, గంగాధర మండలాల్లో కలియతిరిగారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను వీరు టార్గెట్ చేశారు. సర్పంచ్ ఇళ్లు ఎక్కడా ? అంటూ ఆరా తీస్తున్న వీరు వారిని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీరి బారిన పడిన కొంతమంది సర్పంచ్‌లు ఇప్పటికే మోసపోయారు. తమ వద్దకు వచ్చి మంచి జరగాలంటే డబ్బులు ఇవ్వాలని..రూ. 500 ఇస్తే తీసుకోలేదని..రూ. 3వేలు ఇస్తే వెళ్లారని ఓ సర్పంచ్ పేర్కొన్నాడు.
జిల్లాలో తిరుగుతున్న అఘోరా ని సెల్ ఫోన్‌లలో బంధించిన స్థానిక యువకులు అఘోర వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. డబ్బులు వసూలు చేయడానికి కరీంనగర్ కు అఘోరా వచ్చారని, గత కొన్ని రోజుల నుండి అఘోరాలు తిరుగుతున్నారని, వీరు తిరుగుతుండడంతో కీడు జరిగే అవకాశం ఉందని పెద్ద ఎత్తున కరీంనగర్ లో ప్రచారమవుతోంది.
కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లనే టార్గెట్ చేస్తూ మీకు మంచి జరగాలంటే అఘోరా తో పూజ చేయించుకోవాలని, అంతకు మూడు వేల రూపాయలు చెల్లించాలని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న అఘోరాపై పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అఘోరా పేరుతో తిరుగుతున్న వ్యక్తి నిజంగా అఘోరా నా కాదా అన్న అనుమానాలు సైతం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న అఘోరాను అరెస్టు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!