కారులో కోటి నగదు తరలింపు, పట్టుకున్న పోలీసులు, మునుగోడు బై పోల్..
మునుగోడు బై పోల్‌లో ధనం ప్రవాహంలా మారుతోంది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. అప్పటికీ పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మునుగోడులో భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. చల్మడ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు.
కోటి రూపాయలకు పైగా నగదు పట్టుబడింది. కారులో ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్యాష్ తో పాటు కారును కూడా సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న వాహనం కరీంనగర్ కు చెందిన బీజేపీ నేత సొప్పరి వేణుకి చెందినదిగా గుర్తించారు. ఆయన భార్య కరీంనగర్ 13వ డివిజన్ కార్పొరేటర్.

మునుగోడుకే కోటి రూపాయల నగదు తరలిస్తున్నట్లు విచారణలో వేణు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. మాజీ ఎంపీ వివేక్ ఆదేశాలతో విజయవాడకు చెందిన రాము దగ్గరి నుంచి కోటి రూపాయలు తీసుకుని మునుగోడు వెళ్తున్నానని వేణు చెప్పాడని పోలీసులు వివరించారు. సీజ్ చేసిన డబ్బుని ఐటీ అధికారులకు అప్పగించారు.
ఇటు ఇంటెలిజెన్స్ అధికారుల టోల్‌ఫ్రీ నంబరు 15400కి వచ్చిన సమాచారంతో మర్రిపాడు మండలంలోని కృష్ణాపురం టోల్‌ప్లాజా వద్ద ఇంటెలిజెన్స్ టీమ్, సెబ్ అధికారులు తనిఖీలు చేశారు. బెంగళూరు నుంచి కందుకూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 14.5లక్షల నగదు, బెంగళూరు నుంచి పామూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 14 కర్ణాటక మద్యం సీసాలను పట్టుకున్నారు. నగదును మాత్రం మర్రిపాడు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.