ఆ జిల్లాలో 7వేల కోళ్ళు మృతి.. తెలంగాణాలో బర్డ్ ఫ్లూ భయం!
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. గత కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కోళ్లప్రాణాలు తీస్తోంది. తాజాగా నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. నల్గొండ జిల్లాలో కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలోని ఒక పౌల్ట్రీ ఫారంలో సుమారు 7000కోళ్లు చనిపోయాయని తెలుస్తుంది. ఒక్కసారిగా ఇన్ని కోళ్లు చనిపోవడంతో వాటికీ బర్డ్ ఫ్లూ సోకిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఏడు వేల కోళ్ళు మృతి.. లబోదిబో అంటున్న పౌల్ట్రీ ఫారం యజమాని
కోళ్ల ఫారం యజమానులు చనిపోయిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడిక తీసి మట్టిలో పూడ్చిపెట్టారు. గత కొన్ని రోజులుగా వ్యాధికి గురైన ఈ కోళ్లకు చికిత్స అందించడం కోసం వారు హైదరాబాద్ నుంచి వైద్యులను పిలిపించి ప్రయత్నం చేసినప్పటికీ కోళ్లను మాత్రం కాపాడుకోలేకపోయారు. మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి వాటిని కాపాడే ప్రయత్నం చేసిన సదరు పౌల్ట్రీ ఫారం యజమాని ఒక్కసారిగా ఏడు వేల కోళ్లు మృతి చెందడంతో లబోదిబోమంటున్నాడు.

జీవనోపాధి పోయిందని, ఆదుకోవాలని విజ్ఞప్తి
అయితే కోళ్లు ఎందుకు చనిపోయాయి అన్న విషయం వైద్యం అందించిన డాక్టర్లు కూడా తనకు చెప్పలేదని పౌల్ట్రీ నిర్వాహకుడు చెబుతున్నారు. ఎంతో కాలం కష్టపడి పెంచిన కోళ్లు చనిపోవడంతో ఒక తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం, ప్రీమియం సంస్థలు తమను కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కసారిగా పౌల్ట్రీ ఫారం లోని కోళ్ళన్నీ చనిపోవడంతో తమ జీవనోపాధి అస్తవ్యస్తం అయిందని ఆయన లబోదిబోమంటున్నారు.
నల్గొండ జిల్లాలో 7000 కోళ్లు మృతి ఎఫెక్ట్.. జనాల్లో భయం
ఇక నల్గొండ జిల్లాలో ఒకసారిగా 7000 కోళ్లు మృతి చెందడంతో ప్రజలు చికెన్ షాపుల వంక చూడాలంటేనే భయపడుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టడానికి వెటర్నరీ వైద్యుల బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అప్రమత్తమై తెలంగాణ వ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది.
ఏపీ కోళ్ళ వాహనాలు వెనక్కు
మరోవైపు బర్డ్ ఫ్లూ కేసుల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కోదాడ, వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద పశు వైద్య సిబ్బంది మరియు పోలీసు శాఖల ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ లను ఏర్పాటుచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్న కోళ్ల వాహనాలను తిరిగి పంపిస్తున్నారు. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య సిబ్బంది బృందాలుగా జిల్లాలలో బర్డ్ ఫ్లూ కంట్రోల్ పై దృష్టి పెట్టారు.












Click it and Unblock the Notifications