పోలీసు విచారణలో నేరస్తుడు అనుమానాస్పద మృతి: కొట్టి చంపారంటూ బంధువుల ధర్నా
హైదరాబాద్: నగరంలో పోలీస్ విచారణలో నేరస్తుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే, పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడంటూ.. మృతుని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం చేయడానికి ఒప్పుకోమని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. దీంతో నార్త్ జోన్ పరిధిలోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్‌లోని భూపేశ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ చిరంజీవి(32)పై 20కిపైగా దొంగతనం కేసులున్నాయి. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతడే సెల్‌ఫోన్ దొంగిలించినట్లు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి ముగ్గురు కానిస్టేబుళ్లు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. బడంగ్‌పేట్ తీసుకెళ్తున్నామంటూ బంధువులకు చెప్పారు.

రాత్రి 8 గంటల సమయంలో తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ప్రశ్నిస్తున్న సమయంలో అతడికి రక్తపువాంతులతో ఫిట్స్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే నిందితుడు మరణించాడు. రాత్రి 11 గంటల సమయంలో బంధువులకు సమాచారమివ్వడంతో నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద అర్ధరాత్రి వర్షంలోనే ఆందోళన చేసేందుకు వెళ్లారు. అయితే, మారేడుపల్లి పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో మృతదేహం ఉన్న గాంధీ మార్చురీ వద్దకు బుధవారం ఉదయం వచ్చిన మృతుడి బంధువులు బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు.
పోలీసులు చెదరగొట్టడంతో ఆస్పత్రి బయట రాస్తారోకో చేపట్టారు. చిరంజీవిని విచారణ కోసమని తీసుకెళ్లి కొట్టి చంపారంటూ తల్లి లక్ష్మి, కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు తీసుకెళ్లిన సమయంలో అతడు ఆరోగ్యంగానే ఉన్నాడని.. గంటల వ్యవధిలోనే అనారోగ్యంతో ఎలా చనిపోతాడని నిలదీశారు. చిరంజీవి తల, ఛాతీపై గాయాలున్నట్లు తెలిసిందని చెప్పారు. నిజం తెలిసేవరకు కదలబోమంటూ ధర్నాకు దిగారు.

న్యాయం జరిగేవరకు పోస్టుమార్టం చేయొద్దంటూ డిమాండ్ చేశారు. భార్య, పిల్లలకు పరిహారం ఇప్పిస్తామంటూ పోలీసులు, అధికారులు నచ్చజెప్పినా వినలేదు. తమకు డబ్బు అవసరం లేదని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారితో చర్చలు జరిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తుకారాంగేట్ పోలీసులు తెలిపారు. మృతుడి మరణంపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications