‘మీరు బాగుండాలి’: అనుకున్నది సాధించలేక టెక్కీ ఆత్మహత్య
తాను అనుకున్నది సాధించలేదనే మనస్తాపంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: తాను అనుకున్నది సాధించలేదనే మనస్తాపంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను క్షమించాలని కుటుంబసభ్యులను అతడు తన ఆత్మహత్య లేఖలో కోరాడు. ఈ విషాద ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎస్సై చింతకాయల వెంకటేష్ కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన యలమంచిలి సుధాకర్‌రావు (30) హైదరాబాద్ నగరంలోని నానక్‌రాంగూడలోని ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ కంపెనీలో రీసెర్చ్ అనలిస్టుగా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహం కాలేదు. తల్లిదండ్రులు, సోదరి వనస్థలిపురంలో నివాసముంటున్నారు.
సుధాకర్‌రావు తాను పనిచేస్తున్న కంపెనీకి సమీపంలోని గోపన్‌పల్లి జర్నలిస్టు కాలనీలోని ఓ అపార్టుమెంట్ పెంట్‌హౌస్‌లో నివాసం ఉంటున్నాడు. జనవరి 7న సాయంత్రం కంపెనీ నుంచి ఇంటికి వచ్చాడు. తిరిగి కంపెనీకి వెళ్లలేదు. రెండు రోజులగా అతని సోదరి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఈ విషయంపై ఆమె సుధాకర్‌రావు స్నేహితుడు సతీష్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు.

దీంతో అతను మంగళవారం సుధాకర్‌రావు ఉంటున్న అపార్టుమెంట్‌కు వెళ్లి చూడగా తలుపులు లోపల నుంచి గడియపెట్టి ఉండటం, లోపల నుంచి దుర్వాసన వస్తుండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా సుధాకర్‌రావు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెంది కనిపించాడు.
మృతదేహం ఉబ్బి దుర్వాసన వెలువడుతుండటంతో వెంటనే పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 'అమ్మానాన్న, చెల్లి మీరు బాగుండాలి.. నేను అనుకున్నది సాధించలేకపోతున్నా.. నాకు ప్రత్యామ్నాయం లేదు.. అందుకే వెళ్తున్నా అంటూ సుధాకర్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు.
కాగా, సుధాకర్‌రావు రాసిపెట్టిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications