అల్లు అర్జున్ కేసు.. మంత్రి కొండా సురేఖ అనూహ్య స్పందన!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రావడంతో చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కుమారుడు కోమాలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
జైలు నుండి బయటకు వచ్చిన అల్లు అర్జున్
ఇక ఈ క్రమంలో ఈ కేసులో ఏ 11గా ఉన్న అల్లు అర్జున్ ను నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచగా, నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే ఆపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేయడంతో అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం చంచల్ గూడా జైలు నుంచి బయటకు వచ్చారు.

స్పందించిన మంత్రి కొండా సురేఖ
కొంతమంది సమర్థిస్తుంటే మరి కొంతమంది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్టు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా అల్లు అర్జున్ అరెస్టు పైన మంత్రి కొండ సురేఖ స్పందించారు .ఈరోజు నర్సాపూర్ లో మాట్లాడిన మంత్రి కొండ సురేఖ అల్లు అర్జున్ ఎపిసోడ్ తో తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ
అల్లు అర్జున్ అరెస్టుతో పోలీసులకు చట్టాలకు సంబంధం ఉంటుందని తమకేం సంబంధం అంటూ కొండ సురేఖ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ ఘటన పైన మా సీఎం స్పందించారని కూడా కొండ సురేఖ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టు పైన తాజాగా చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్
సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని చేసిన వ్యాఖ్యలు, చట్టం ఎవరికైనా ఒకే విధంగా ఉంటుందని చెప్పిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో రాజకీయ వర్గాల నుండి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications