Allu Arjun: ఎన్నికల ప్రచారంలో స్టయిలిష్ స్టార్- పవన్ నిర్ణయంపై ఉత్కంఠ..!!
తెలుగు రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు సినీ ప్రముఖుల రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఏపీలో పవన్ కల్యాణ్ పాత్ర రాజకీయంగా కీలకంగా మారుతోంది. ఈ సమయంలో తెలంగాణలోనూ ఎన్నికలు హోరా హోరీగా మారుతున్నాయి. బీజేపీకి మిత్రపక్షంగా పవన్ వ్యవహరిస్తున్నారు. అదే మెగా క్యాంప్ నుంచి మరో హీరో బన్నీ బీఆర్ఎస్ ప్రచారానికి సిద్దమయ్యారు.
మామ కోసం రంగంలోకి బన్నీ : జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ లీడ్ చేస్తున్న ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఏపీ, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు సోదరుడితో కలిసి జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలోనే మెగా క్యాంప్ నుంచి మరో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలోకి వస్తున్నారు. అయితే, మామ నాయకత్వంలోని జనసేన కాదు. పవన్ మద్దతు ఇస్తున్న బీజేపీకి ప్రత్యర్ధి అయిన బీఆర్ఎస్ కు ప్రచారం చేయనున్నారు. నాగార్జున సాగర్ నుంచి అల్లు అర్జున్ మామ (భార్య స్నేహ రెడ్డి తండ్రి), బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. దీంతో, బన్నీ పాత్ర ఆసక్తి కరంగా మారుతోంది.

అటు పవన్..ఇటు అల్లు అర్జున్ : 2014 ఎన్నికల్లోనే చంద్రశేఖర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఇప్పుడు తాజాగ వచ్చే ఎన్నికల్లో తన స్వస్థలమైన నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ దాదాపు ఖాయమైంది. ఇప్పటికే ఆయన తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తాజాగా పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి భట్టుగూడెం వద్ద కంచర్ల కన్వెన్షన్ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ఈ ప్రారంభోత్సవానికి ఈ గ్రామానికి అల్లు అర్జున్ వెళ్లనున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఎన్నికల్లోనూ మామకు మద్దతుగా బన్నీ ప్రచారం చేస్తారని చెబుతున్నారు.
రాజకీయంగా ఆసక్తి : వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తానని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు. సీటు దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. తన కోసం అల్లు అర్జున్ ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలిపారు. మెగా కుటుంబంలో తాను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సినీ నటుడిగా బన్నీ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారని, రాజకీయంగా కూడా ఆయన సేవలు అవసరమని చెప్పారు. దీంతో, అటు పవన్ బీజేపీకి మద్దతుగా..ఇటు బన్నీ బీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం అటు సినీ, ఇటు రాజకీయంగానూ ఆసక్తి కర చర్చగా మారుతోంది.












Click it and Unblock the Notifications