కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి: రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్; కేసీఆర్ విలవిల!!
తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కీలక రాజకీయ పరిణామాలు అటు రాజకీయ వర్గాలకే కాకుండా, ప్రజలకు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీకి తాజా పరిణామాలు ఊహించని షాక్ ను ఇస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు బీఆర్ఎస్ నేతలు చూడడం మాజీ సీఎం కేసీఆర్ కు ఏమాత్రం రుచించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షలో బీఆర్ఎస్ నేతలు పోలోమని కాంగ్రెస్ పార్టీలోకి పరుగులు పెడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ మామ బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఆయన పార్టీలో చేరిక విషయంపై చర్చించారు. వచ్చే ఎన్నికలలో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక రేవంత్ రెడ్డి తో సమావేశం అనంతరం మాట్లాడిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం సొంతగూటికి వచ్చినట్టుగా ఉంటుందని చెప్పారు.
తాను విద్యాభ్యాసం చేసే సమయంలోనే కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగంలో పని చేసినట్టు, 2014 కంటే ముందు తన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టుగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత 2018 ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయలేదు. మళ్లీ గత ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని, నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి, అనేక కార్యక్రమాలు చేసి రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ కే అవకాశం దక్కింది.
దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ టికెట్ ను ఆశిస్తున్న ఆయన ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారని సమాచారం. ఇక అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిని చేర్చుకుంటే తమకు కూడా ప్లస్ అవుతుందని, ఎంపీ ఎన్నికలలో అల్లు అర్జున్ సినీ గ్లామర్ ను కూడా ఉపయోగించుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications