ఆర్టీసీ బస్సులను వదిలిపెట్టం అంటున్న మహిళలు.. ఇది నిజంగా శుభవార్తే!
తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి సంకల్పించిన ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా అనేక అవకాశాలను కల్పిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, గోడౌన్లు మహిళల చేత నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఆర్టీసీలో అద్దె బస్సులను మహిళలతో కొనుగోలు చేయించి, వాటిని మహిళా సంఘాల ద్వారా నిర్వహించి తద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి సెర్ప్ సీఈఓ లేఖ
ఈ క్రమంలో ఆర్టీసీలో బస్సులను కొనుగోలు చేసి అద్దెకు పెట్టిన మహిళా సంఘాలు ప్రతినెల లక్షల రూపాయల ఆదాయాన్ని అర్థిస్తున్నారు. ఆర్టీసీలో అద్దె బస్సులను మహిళా సంఘాల మహిళలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న క్రమంలో తాజాగా సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి నాగిరెడ్డికి ఒక కీలకమైన లేఖ రాశారు. అందులో ఆర్టీసీ అద్దె బస్సులను మరిన్ని నిర్వహించేందుకు పొదుపుసంఘాల మహిళలు సిద్ధంగా ఉన్నారన్నారు.

448 అద్దె బస్సుల కొనుగోలుకు తాము సిద్ధం అని లేఖ
మహిళా సమాఖ్యల ద్వారా నిర్వహించడానికి వీలుగా మరో 448 అద్దె బస్సుల కొనుగోలుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఆమె లేఖలో పేర్కొన్నారు. అవసరమైన ప్రభుత్వ అనుమతులు మంజూరైన వెంటనే ఈ కొత్త బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తామని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలను కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిర మహిళా శక్తి పథకంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోందని ఆమె తెలిపారు.
ఆర్టీసీ అద్దె బస్సులకు నెలకు అద్దె ఇలా
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారతను ప్రోత్సహించేలా, వారికి స్థిరమైన ఆదాయాన్ని అందించేలా రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల ద్వారా కొనుగోలు చేసిన 152 ఆర్టీసీ బస్సులు ఆర్టీసీలో అద్దెకు నడుస్తున్నాయి. వీటిని మహిళా సంఘాలు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. ప్రతి బస్సుకు నెలకు 77 వేల 200 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు.
ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణకు ఉత్సాహం చూపిస్తున్న పొదుపుసంఘాలు
ఈ పథకం ద్వారా మహిళలు గణనీయమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. కొన్ని సంఘాలు ఇప్పటికే ప్రతి బస్సు ద్వారా లక్షల ఆదాయాన్ని పొందుతూ సంఘాలను సైతం ఆర్థికంగా బలోపేతం చేసుకుంటున్నారు. మరిన్ని పొదుపు సంఘాల మహిళలు ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణకు ఉత్సాహం చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications