కృష్ణా జలాలపై కేటీఆర్ హాట్ కామెంట్స్ : రాజీ పడం; ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడతాం !!
తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తాజాగా కొనసాగుతున్న ఏపీ తెలంగాణా జల వివాదాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా జలాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరగనివ్వమని ఆయన తేల్చి చెప్పారు.

జల వివాదం పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్ . నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మరోమారు జల వివాదం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం రావాల్సిన నీటి వాటా ను సాధించుకుని తీరుతాం అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో అమలయ్యే స్కీమ్స్ కర్ణాటకలో లేవు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు పొరుగు రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రంలో కళ్యాణలక్ష్మీ , రైతు బీమా, రైతు బంధు పథకాలు ఎందుకు లేవు అంటూ బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. భారత దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని గుర్తు చేసిన కేటీఆర్ రైతుల సాగు నీటి అవసరాలు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామన్న కేటీఆర్
రైతుల వద్ద పంటను కొనుగోలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా నెలకొల్పుతామని పేర్కొన్న కేటీఆర్, గతంలో పాలమూరుకు 14 రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేవని ఇప్పుడు రెండు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా పంచాయతీలకు, మునిసిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పిన కేటీఆర్ హరితహారం ద్వారా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని, ముందు తరాలకు మంచి భవిష్యత్ ను ఇవ్వాలని పిలుపునిచ్చారు.
నారాయణపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
ఈరోజు నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఆసుపత్రిలో చిన్న పిల్లల ఐసీయు వార్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సమీకృత మార్కెట్ కు, అమరవీరుల స్మారక పార్కు కు శంకుస్థాపన చేశారు కేటీఆర్. జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన చిల్డ్రన్, సైన్స్ పార్క్ ను కేటీఆర్ ప్రారంభించారు. త్వరలో నారాయణపేట జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ భవనాల నిర్మాణం కూడా చేపడతామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications