వేసవి సెలవులకు ఊరెళ్తున్నారా? దొంగతనాలపై తస్మాత్ జాగ్రత్త; పోలీసుల అలెర్ట్!!
వేసవి సెలవులు వచ్చాయి. వేసవి సెలవుల్లో సొంత ఊళ్లకు వెళ్లాలని లేదా సమ్మర్ హాలిడేస్ ను వివిధ ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలని భావించే వారికి ఊరు వెళ్ళాలి అనుకుంటే కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు వరంగల్ కమీషనరేట్ పోలీసులు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ విభాగం రూపొందించిన ఓ కరపత్రాన్ని ఆవిష్కరించి ప్రజలకు దొంగతనాల పై అవగాహన కల్పిస్తున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పించడం కోసం చోరీల నివారణకు ప్రజలకు పలు సూచనలు చేసారు. ఊరు వెళ్లేటప్పుడు ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును లాకర్లలో భద్ర పరచుకోవాలి అని సూచించారు.

ఇంట్లో బీరువా తాళాలు ఇంట్లో పెట్టకుండా తమ వెంట తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువరోజులు విహారయాత్రల్లో వుంటే పేపర్, పాల వారిని రావద్దని సూచించాలని, పనిమనిషి వుంటే రోజు ఇంటి ముందు శుభ్రం చేయమని చెప్పాలని కొన్నారు. విలువైన వస్తువులు, నగదు గురించి, వ్యక్తిగత విషయాలను గురించి ఇతరులకు చెప్పరాదన్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టంను, సిసి కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఐపి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి స్థితిగతులను మొబైల్లో వీక్షించవచ్చని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయట గేటు తాళం వేయకూడదని, లోపలి నుండి గొళ్ళెం పెట్టాలని, ఇంటిలోపల, బయట లైటు వేసి వుంచాలని పేర్కొన్నారు. అపార్ట్మెంట్లలో సిసికెమెరాలు, వాచ్మెన్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఊర్లకు వెళ్లేవారు తమ ఇల్లు ఏ పరిధిలోకి వస్తుందో సంబంధిత పోలీస్ స్టేషన్, ఏరియా కానిస్టేబుల్ సెల్ నంబర్లు దగ్గర వుంచుకోవాలన్నారు.
ప్రజలు, పోలీసులు సమన్వయంతో కలిసి పనిచేస్తే చోరీలను నియంత్రించగలమని స్పష్టం చేశారు. ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు ప్రక్కల వారికి, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు .ఎవరైన కాలనీలో, ఆపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా గమనిస్తే తక్షణమే డయల్ 100 కు గాని స్థానిక పోలీస్ స్టేషన్ కు కానీ ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications