ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేకపూజలు చేసిన బండి సంజయ్; హిందూసమాజం సంఘటితం కావాలని పిలుపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో హిందూ సమాజం సంఘటితం కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ భారీ గణనాధుని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్, ఖైరతాబాద్ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఇదే సమయంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ఖైరతాబాద్ గణనాథుడికి 21 కేజీల లడ్డూను సమర్పించారు.

ఖైరతాబాద్ గణనాధుడికి ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్, హిందూ సమాజంపై వ్యాఖ్యలు
ఖైరతాబాద్ గణనాథుడి పూజల అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలని ఒక్క అడుగుతో ప్రారంభమై అరవై ఎనిమిది సంవత్సరాలుగా ఖైరతాబాదు లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. నాడు గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించిన శంకరయ్య అడుగుజాడల్లో కుటుంబ సభ్యులు నడుస్తూ నేటికీ బడా గణపతి ని ముందుకు తీసుకెళ్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. హిందూ సమాజం చీలిపోతే తెలంగాణ ఉనికికే ప్రమాదమని హెచ్చరించిన బండి సంజయ్, హిందువులంతా కలిసి కట్టుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

నవరాత్రి ఉత్సవాల ఉద్దేశం చెప్పిన బండి సంజయ్
బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టడానికి ఐక్యతను తీసుకురావడానికి బాలగంగాధర్ తిలక్ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారని, హిందూ సమాజాన్ని ఏకతాటి మీదకు తీసుకురావడానికి వినాయక నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అందరూ జాగ్రత్తగా పరిశీలించాలని పేర్కొన్న బండి సంజయ్, హిందూ బంధువులందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామని బండి సంజయ్ వెల్లడించారు.

తెలంగాణాలో తాజా పరిణామాలతో బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆసక్తి
ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనేక ఘటనలు మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నాయి. ఇక గణేశ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసి వినాయక నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే సమయంలో బండి సంజయ్ హిందూ సమాజాన్ని ఉద్దేశించి, అందరూ జాగ్రట్టంగా ఉండాలని తాజాగా చేసిన వ్యాఖ్యలపై అందరి ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications