బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు: హైదరాబాద్ మెట్రోకు, కేంద్రానికి ఊహించని షాక్!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లు, యూట్యూబర్స్ పైన కేసు నమోదు చేసి వారికి నోటీసులు అందించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసులో మరో షాకింగ్ చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పలువురిని విచారిస్తున్న వేళ, హైదరాబాద్ మెట్రోకు ఊహించని షాక్ తగిలింది.
హైదరాబాద్ మెట్రోకు షాక్
నేడు హైకోర్టులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు కు సంబంధించి మెట్రో రైళ్లలో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేశారని ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. న్యాయవాది నాగూర్ బాబు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసి హైదరాబాద్ మెట్రో పైన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్లో కోరారు.

కేంద్రాన్ని, ఈడీని కూడా చేరుస్తూ పిల్
ప్రజలకు సేవలు అందించే మెట్రో ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలని, కానీ ఇటువంటి ఇల్లీగల్ పనులకు పాల్పడటం పైన మెట్రో పై చర్యలు తీసుకోవాలని ఆయన తన పిల్ లో కోరారు. హైదరాబాద్ మెట్రో పైన మాత్రమే కాకుండా, ఈ వ్యవహారంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని , డీజీపీని, మెట్రో ఎండి ని, ఈడీ లను కూడా ప్రతివాదులుగా చేర్చారు.
విచారణ చేపట్టిన న్యాయస్థానం
ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈనెల 24వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పేరుతో యువతను యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టాలీవుడ్ ప్రముఖులు తప్పుదారి పట్టించారని పలువురు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ ల బారినపడి ఎంతో మంది యువత ప్రాణాలను కోల్పోయారని పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రో ఏం చేస్తుంది?
ఇక ఈ యాప్స్ పైన, వీటిని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో పలువురు ఫిర్యాదుతో టాలీవుడ్ సెలబ్రిటీల పైన, మరి కొంతమంది యూట్యూబర్ల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి యాడ్స్ వేశారని, మెట్రో పైన కూడా చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలైన వేళ హైదరాబాద్ మెట్రో దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications