బీఆర్ఎస్, బీజేపీ మాటల ప్రభుత్వాలే చేతల ప్రభుత్వాలు కాదు: భట్టి విక్రమార్క
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో బిఆర్ఎస్, బిజెపి లను టార్గెట్ చేశారు. పాదయాత్రలో భాగంగా వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీని సందర్శించిన భట్టి విక్రమార్క తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, కేయూ జేఏసీ, టీఎస్ జేఏసీ నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని ఇచ్చిన వినతి పత్రం పై స్పందించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లౌకిక వాదానికి భిన్నంగా ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడిన దానికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదప లేదని మండిపడ్డారు. కేసీఆర్ తీరు వల్ల రాష్ట్రం నష్టపోతుందని పేర్కొన్నారు.

అసలు బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ఏంటో చెప్పాలని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు భారత రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించిందని, మీరు రిజర్వేషన్లు కల్పించేదేమిటి అని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం అని రెండోసారి కేసీఆర్ కు అవకాశం ఇస్తే ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. నిధులు, నియామకాలు లేకుండా రాష్ట్రాన్ని దోపిడీ చేశారన్నారు.
జనాభా దామాషా ప్రకారం రావాల్సిన రిజర్వేషన్ల గురించి రాహుల్ గాంధీ కొట్లాడుతున్నాడని పేర్కొన్నారు. తెలంగాణలో అత్యధికంగా బహుజనులు 54 శాతం ఉన్నారని గుర్తు చేశారు. జనగణన వెంటనే మొదలుపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అమిత్ షా ఇక్కడి డిమాండ్ కు అనుగుణంగా సమాధానం చెప్పకుండా మరేదో చెప్పిపోతున్నాడని అసహనం వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజేపి 9ఏళ్ళలో 18 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో బండి సంజయ్ సమాధానం చెప్పాలని నిలదీశారు. దేశప్రజల సొమ్మంతా దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ అంటే రాజకీయం చేస్తున్నారని అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే గత్యంతరం లేని పరిస్థితిలో కాంగ్రెస్ గెలిపించుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన మాట చేతల్లో లేదని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.












Click it and Unblock the Notifications