చంద్రబాబుపై వీరాభిమానం.. ఆయన సీఎం అయ్యాకే.. ఐదేళ్ళ తర్వాత తిరికి సొంతూరికి వచ్చిన మహిళ
2019లో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మహిళ చంద్రబాబు కోసం చేసిన ఒక ఛాలెంజ్ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. చంద్రబాబు పై విపరీతమైన అభిమానం ఉన్న ఒక మహిళ 2019లో చంద్రబాబు గెలుస్తాడని చేసిన ఛాలెంజ్ తో, చంద్రబాబు ఓడిపోవడంతో ఆమె అన్నంత పని చేసింది.. ఆమె ఇంతకీ ఎవరితో పందెం కట్టింది? ఓడిపోతే ఏం చేస్తానని చెప్పింది? ప్రస్తుతం ఆమె ఏం చేసింది?
2019లో చంద్రబాబు కోసం ఒక మహిళ ఛాలెంజ్
చంద్రబాబు కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మహిళ పందెం కట్టింది. తమ వాళ్ళతోనే 2019 ఎన్నికలలో చంద్రబాబు గెలుస్తాడని ఛాలెంజ్ చేసింది. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ విచిత్ర సంఘటన వివరాల్లోకి వెళితే కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్ట విజయలక్ష్మి 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు సీఎం అవుతాడు అని కుటుంబ సభ్యులతో చాలెంజ్ చేసింది.

అన్న మాటకు కట్టుబడి ఊరొదిలి వెళ్ళిపోయిన మహిళ
సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతాడు అంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆమెతో బెట్ కట్టారు. ఒకవేళ చంద్రబాబు కాకుండా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే తన ఊరు వదిలి వెళ్ళిపోతానని, మళ్ళీ చంద్రబాబు సీఎం అయ్యాకే ఊర్లోకి తిరిగి వస్తానని విజయలక్ష్మి శపథం చేసింది. అయితే 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించి, ఏపీ సీఎం కావడంతో పందెం కట్టి ఓడిపోయిన విజయలక్ష్మి చెప్పిన మాట ప్రకారం ఊరు వదిలి వెళ్ళిపోయింది.
ఐదేళ్ళ తర్వాత ఊరికి తిరిగొచ్చిన మహిళ
గత ఐదేళ్ళుగా ఆమె ఊరు ముఖం కూడా చూడలేదు. మళ్లీ ఇప్పుడు 2024 ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధించడంతో చంద్రబాబు సీఎం అయిన తర్వాతే ఊర్లో అడుగు పెడతానంటూ శపథం చేసిన విజయలక్ష్మి స్వగ్రామానికి చేరుకుంది. ఇటీవల ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం ఐదేళ్ల తరువాత సొంత గ్రామం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చేరుకున్న విజయలక్ష్మికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.
చంద్రబాబు వీరాభిమాని..
గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి తన పుట్టింట్లో అడుగు పెట్టింది విజయలక్ష్మి. చంద్రబాబు కోసం విజయలక్ష్మి చేసిన శపథం నెరవేరడంతో స్వగ్రామం చేరుకున్న విజయలక్ష్మిని సత్కరించిన కుటుంబసభ్యులు , గ్రామస్థులు ఆమె మొండి పట్టుదలకు ఆశ్చర్యానికి గురయ్యామని చెప్పారు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు చంద్రబాబు మీద వీరాభిమానం ఎలా ఉంటుందో విజయలక్ష్మి చూపించారని తెగ మెచ్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications