బండి సంజయ్ అరెస్ట్ - రంగంలోకి బీజేపీ అధినాయకత్వం..!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై ఢిల్లీ పెద్దలు సీరియస్ అయ్యారు. అరెస్ట్ కు దారి తీసిన పరిణామాలు..కేసు గురించి ఆరా తీసారు. అభియోగాలు - అరెస్ట్ తీరును బీజేపీ నేతలు తప్పు బడుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు మంత్రి కిషన్ రెడ్డి మొత్తం పరిణామాలను వివరించారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాకు తెలంగాణలో బండి సంజయ్ అరెస్ట్..చోటు చేసుకుంటున్న పరిణామాలను తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటానికి బీజేపీ నేతలు సిద్దం అవుతున్నారు.
బండి సంజయ్ అరెస్ట్ పైన ప్రధాని మోదీ పార్టీ నేతలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. పదో తరగతి పరీక్ష పత్రాల లీక్ కేసులో బండి సంజయ్ ను నిందితుల జాబితాలో చేర్చారు. 154, 157 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. సంజయ్ ను ఏ -5గా చూపించారు. అర్దరాత్రి 1 గంటకు సంజయ్ ను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసారు.
బండి సంజయ్ అరెస్ట్ పైన తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలోని బీజేపీ ముఖ్యులు సంజయ్ అరెస్ట్.. పరిణామా పైన ఆరా తీసారు. మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర హోం మంత్రికి తెలంగాణ పోలీసులు సంజయ్ పైన నమోదైన అభియోగాలను వివరించారు. డీజీపీతోనూ కిషన్ రెడ్డి మాట్లాడినట్లు సమాచారం.

బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అరెస్ట్ తీరును తప్పుపట్టారు. సీఎం కేసీఆర్ అహంకారానికి బండి సంజయ్ అరెస్ట్ ఒక నిదర్శనం అని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
అరెస్టుకు కారణాన్ని వెల్లడించడంలో తెలంగాణ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూను బీజేపీ ప్రశ్నిస్తున్నందుకే తమ నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు భయపడే... ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ కు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతి పాలనపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందని తరుణ్ చుగ్ చెప్పుకొచ్చారు. పరిపాలన తీరును ప్రశ్నిస్తే జైల్లో వేస్తామంటే.. బీజేపీ నాయకులెవరూ భయపడరని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలెవరూ భయపడవద్దని భరోసా ఇచ్చారు.
పార్టీ రాష్ట్ర నేతలతో తరుణ్ చుగ్ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు. సంజయ్ పైన కేసుల, అరెస్ట్ తో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల పైన దిశా నిర్దేశం చేయనున్నారు. అటు న్యాయ పరంగానూ పోరాటం చేసేందుకు బీజేపీ సిద్దం అవుతోంది.












Click it and Unblock the Notifications