లగచర్లకు బీజేపీ ఎంపీ డీకే అరుణ.. తీవ్ర ఉద్రిక్తత!
ఇటీవల కొడంగల్ నియోజకవర్గ లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు అధికారుల పైన జరిగిన దాడి ఘటనతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ ఘటన నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎంపీ డీకే అరుణ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో పర్యటించడానికి వెళ్లడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రోడ్డుపై బైఠాయించి డీకే అరుణ ఆందోళన
లగచర్ల వెళ్లడానికి ప్రయత్నించిన బిజెపి ఎంపీ డీకే అరుణను పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలోకి వెళ్లడానికి వీలులేదని పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఎంపీ అరుణని అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి నేతలు రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేశారు.

తన నియోజకవర్గానికి కూడా వెళ్ళకూడదా? డీకే అరుణ ప్రశ్న
తన నియోజకవర్గంలోని ప్రజల దగ్గరకు తనను వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం పైన అసహనం వ్యక్తం చేస్తున్న డీకే అరుణ తనకు అవమానం జరిగిందని పేర్కొన్నారు. తాను నియోజకవర్గ ఎంపీగా తన నియోజకవర్గంలోని ప్రజలను పరామర్శించకూడదా అంటూ డీకే అరుణ ప్రశ్నించారు. తాను ఏం తప్పు చేశానని పోలీసులు అడ్డుకుంటున్నారో చెప్పాలని ఆమె అడిగారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే జిల్లాలో లాండ్ ఆర్డర్ సమస్య
తాను కలెక్టర్ ని కలవడానికి వెళుతున్నానని తనకు అపాయింట్మెంట్ కూడా ఉందని డీకే అరుణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే జిల్లాలో లాండ్ ఆర్డర్ సమస్య వచ్చిందని డీకే అరుణ తెలిపారు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదెక్కడి న్యాయం... డీకే అరుణ ఫైర్
తన నియోజకవర్గంలో తనకు ఎక్కడికైనా వెళ్లే హక్కు స్వతంత్రత ఉంది అని పేర్కొన్న ఆమె తనను పోలీసులు అడ్డుకోవడం ఆమానుషమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి లగచర్లకు వెళితే రాని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తాను వెళితేనే వస్తుందా అంటూ ప్రశ్నించారు. ఎంపీగా తనని ఎందుకు పంపించడం లేదు. ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు .
డీకే అరుణ అరెస్ట్ కు పోలీసుల యత్నం.. ఉద్రిక్తత
ఇక డీకే అరుణ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆమెను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేయగా తాను ఏ తప్పు చేయకుండా ఎందుకు పోలీస్ స్టేషన్ కు వస్తానని పోలీసుల తీరుపైన డీకే అరుణ మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications