ఆరూరి రమేష్ కోసం రోడ్డెక్కిన బీఆర్ఎస్ , బీజేపీ నేతలు.. ఆరూరి చొక్కా చించి రచ్చ!!
బిఆర్ఎస్ పార్టీ ని వీడేందుకు సిద్ధమైన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యవహారంలో హై డ్రామా చోటుచేసుకుంది. ఈరోజు బిజెపిలో చేరే విషయంపై తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించేందుకు ఆరూరి రమేష్ సిద్దమైన క్రమంలో అక్కడ నాటకీయత నెలకొంది.
వర్ధన్నపేట మాజీఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీని వీడి వెళ్లేందుకు ఇష్టం లేని బిఆర్ ఎస్ నేతలు ఆయన నివాసం వద్దకు వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మీడియా సమావేశం నిర్వహించడానికి ముందే ఆయన ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, నాగూర్ల వెంకటేశ్వర్లు పార్టీ మారకుండా ఉండేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. మాజీమంత్రి హరీష్ రావు ఆరూరి రమేష్ తో ఫోన్లో మాట్లాడి పార్టీవీడి వెళ్ళొద్దని సూచించారు.

ఇక ఇదే సమయంలో ఆరూరి ఇంటికి చేరుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరూరి రమేష్ ను బుజ్జగించి తన వాహనంలో హైదరాబాద్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి వాహనాన్ని బిజెపి శ్రేణులు ఆలేరు వద్ద అడ్డుకున్నారు. అక్కడ కొద్దిసేపు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విషయంలో కొద్దిసేపు పెనుగులాట చోటు చేసుకుంది.
ఈ పెనుగులాటలో ఆరూరి రమేష్ చొక్కా చించేశారు కార్యకర్తలు. ఎర్రబెల్లి వాహనంలో ఉన్న ఆరూరిని బలవంతంగా వేరే వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు బిజెపి శ్రేణులు. బిజెపి జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు ఆయనను చుట్టుముట్టి నిలదీశారు. నిన్న బీజేపీలో చేరుతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో చెప్పిన ఆరూరి రమేష్, ఈరోజు బీఆర్ఎస్ ఒత్తిడికి తలొగ్గుతున్నారు అని బిజెపినాయకులు మండిపడుతున్నారు.
ఇక ఇదే క్రమంలో నిన్న బిజెపిలో చేరే విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కలిసారని అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ హై డ్రామా మధ్య ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లో ఉంటారా? లేక బిజెపిలో చేరుతారా? అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications