వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లగొండ ఉప ఎన్నికకే కేసీఆర్ మొగ్గు: మక్తల్‌కు కూడా.. దసరా తర్వాతే స్పష్టత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక, కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మాదిరిగా తెలంగాణలోనూ ‘ఉప ఎన్నిక’ పరీక్ష కోసం అధికార టీఆర్ఎస్ సంసిద్ధమవుతున్నదని తెలుస్తోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక, కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మాదిరిగా తెలంగాణలోనూ 'ఉప ఎన్నిక' పరీక్ష కోసం అధికార టీఆర్ఎస్ సంసిద్ధమవుతున్నదని తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో జరిగితే.. కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగినవే. కానీ తెలంగాణలో ఒకవేళ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే భిన్నమైన పరిస్థితి.

నల్లగొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన వారే. ఒకవేళ ఆయా స్థానాలకు ఎన్నిక నిర్వహించాలంటే ముందుగా గుత్తా సుఖేందర్ రెడ్డి.. చిట్టెం రామ్మోహన రెడ్డి.. ఆ మాటకు వస్తే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. సనత్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలుపొందాలి.

కానీ ఆ పని జరుగలేదనుకోండి అది వేరే సంగతి. ప్రస్తుతం తెలంగాణలో బలమైన రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. బలహీన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉండనే ఉన్నది. ఇక తెలంగాణలో టీడీపీకి చోటు లేని పరిస్థితి.

అయినా ఇటీవలి కాలంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ వైఖరిని సవాల్ చేసేందుకు పూనుకుంటున్న తరుణంలో కొత్తగా సీఎం కేసీఆర్ మానస పుత్రికల్లో ఒకటిగా భావించే 'రైతు సమన్వయ సమితి' రాష్ట్ర సమన్వయకర్తగా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఆయన ఖరారు చేశారని వార్తలొస్తున్నాయి. విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు.. న్యాయస్థానం నుంచి సమస్యలు తలెత్తకుండా.. అనర్హత ఇష్యూ ముందుకు రాకుండా గుత్తా సుఖేందర్ రెడ్డితో పక్కాగా రాజీనామా చేయిస్తారని వార్తలొస్తున్నాయి.

ఈ అంశం అన్ని రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నది. ఈ నియోజకవర్గం.. ఆ మాటకు వస్తే నల్లగొండ జిల్లా రాజకీయాలు తొలి నుంచీ ఒక సామాజిక వర్గంపైనే ఆధారపడి సాగుతున్నాయి. ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకున్న తర్వాతే సీఎం కేసీఆర్ ముందుకు వెళతారని భావిస్తున్నారు.

ఇబ్బందికర పరిస్థితులకు దూరంగా ఉంటేనే మేలని ఇలా

ఇబ్బందికర పరిస్థితులకు దూరంగా ఉంటేనే మేలని ఇలా

సీఎం కేసీఆర్ బహిరంగా ఉప ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నా, ఒకరిద్దరు సీనియర్ మంత్రులు మాత్రం విముఖత ప్రదర్శిస్తున్నారని వినికిడి. ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయించి ఉప ఎన్నిక సమరాన్ని ఎదుర్కోవడం, అధికారంలో ఉంటూ ప్రజాప్రతినిధులతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళితే ప్రజల్లో అపోహలు తలెత్తుతాయని సీనియర్లు కేసీఆర్‌తో చెప్తున్నారని సమాచారం. రైతు సమన్వయ సమితి సమాఖ్య రాష్ట్ర సమన్వయకర్తగా గుత్తా సుఖేందర్ రెడ్డిని నియమించినా ఎంపీగా కొనసాగే అవకాశంపై న్యాయశాఖ అధికారులు, ఇతర న్యాయ నిపుణులతోనూ చర్చించి, సలహాలు తీసుకోవాలని సూచించారని తెలిసింది.

గుత్తాతో రాజీనామా చేయించి, ఆయన పదవి కోసమే రాజీనామా చేయించారన్న విమర్శలు వస్తే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారని అంటున్నారు. ఎవరేం చెప్పినా తెలంగాణ గడ్డపై మరోసారి ఉప ఎన్నిక వేడి రగిల్చేందుకే సీఎం కేసీఆర్ పూనుకున్నారని తెలుస్తున్నది. ఈ నెలాఖరు నాటికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఇటీవల నల్లగొండ లోక్ సభ, మక్తల్ అసెంబ్లీ స్థానాల పరిధిలో అత్యంత రహస్యంగా సీఎం కేసీఆర్ జరిపించిన సర్వేలో సానుకూల ఫలితం వచ్చిందని సమాచారం. మరోవైపు నిఘా వర్గాల నుంచి ఆయన తెప్పించుకుని సరిపోల్చుకున్నారని వినికిడి. ప్రస్తుతం ఈ రెండు స్థానాల పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి సానుకూల వాతావరణం ఉన్నదని తేలింది.

పరుగులు తీయనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలా

పరుగులు తీయనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలా

ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించగానే ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందనే అంచనాలో ఉన్న టీఆర్‌ఎస్‌ పెద్దలు, అంతకంటే ముందే చక్కదిద్దాల్సిన పనులపై దృష్టి సారించారు. ఎంపీ పదవికి గుత్తా రాజీనామా, ఆమోదం, ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలతో కోడ్‌ అమల్లోకి వచ్చే నాటికే ఆ లోక్‌సభ స్థాన పరిధిలో మంచీ చెడులను చూసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించే సంకల్పంతో టీఆర్ఎస్ ముందుకెళ్తోంది.

బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.19 కోట్లు మంజూరు చేసింది. రానున్న రోజుల్లో మిగిలిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు పెద్దఎత్తున నిధుల విడుదలకు కసరత్తు జరుగుతోంది. నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలో అసంపూర్తిగా ఉన్న, కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు తొందర్లోనే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే గుత్తాతో ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దసరా తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని కేసీఆర్‌ సన్నిహితులు చెబుతున్నారు.

కేసీఆర్‌తో సభ.. ఇలా మంత్రుల క్యాంపెయిన్

కేసీఆర్‌తో సభ.. ఇలా మంత్రుల క్యాంపెయిన్

సీఎం కేసీఆర్‌ ఉపఎన్నిక ఖాయమని స్పష్టతనివ్వడంతో టీఆర్ఎస్‌లోని కీలక నేతలు దాదాపు ప్రచార ప్రణాళికను ఖరారు చేశారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న మండలాలు, మున్సిపాలిటీలను 46 యూనిట్లుగా విభజించి.. ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని ఇన్‌చార్జిగా నియమించాలని నిర్ణయించారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కో సెగ్మెంట్‌కు ఒక మంత్రి చొప్పున ఇన్‌చార్జిలుగా పెడ్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ నేతలతో పాటు ఉప ఎన్నికల ప్రచారంలో అనుభవం ఉన్న పరిసర జిల్లాల పార్టీ ముఖ్య నేతలకు కూడా ఈ ఉప ఎన్నికల ప్రచార బాధ్యతను పంపిణీ చేయాలని నిర్ణయించారు. నల్లగొండ లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ పాల్గొనే విధంగా ఒకే ఒక్క భారీ ప్రచార సభను నిర్వహించాలని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున ఉప ఎన్నికల ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లేలా కేసీఆర్‌ సభ నిర్వహణ ఏర్పాట్లు ఉంటాయంటున్నారు. మంత్రులు హరీశ్ రావు‌, కేటీఆర్‌, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎంపీ కవితలతో ప్రచార కార్యక్రమాలు ఉంటాయని అంటున్నారు.

ఉత్తమ్, జానా, కోమటిరెడ్డిలకు పరీక్ష

ఉత్తమ్, జానా, కోమటిరెడ్డిలకు పరీక్ష

నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే రాష్ట్రంలోని అన్ని పార్టీలకు, ఆయా పార్టీల అగ్రనాయకులం దరికీ రాజకీయంగా జీవన్మరణ సమస్యగానే మారుతుంది. నల్లగొండ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌ ఇప్పటికీ బలంగా ఉంది. నల్లగొండ లోక్‌సభ పరిధిలోనే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి (హుజూర్‌నగర్‌), కే జానారెడ్డి (నాగార్జునసాగర్‌), వీరిపై నేరుగా విమర్శలను ఎక్కుపెడుతున్న మాజీమంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), ఉత్తమ్‌ సతీమణి పద్మావతీరెడ్డి (కోదాడ) ఎమ్మెల్యేలుగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్‌ భాస్కర్‌రావు (మిర్యాల గూడ), సీపీఐ నుంచి రవీంద్ర నాయక్‌ (దేవరకొండ) టీఆర్‌ఎస్‌లో చేరారు.

అంతకుముందు సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ రెడ్డికి భాస్కర్‌రావు, రవీంద్రనాయక్‌ తోడయ్యారు. పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ స్థాయిల పార్టీల నాయకులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటికీ నల్లగొండలో కాంగ్రెస్‌కు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉత్తమ్‌ రెండు నియోజక వర్గాల్లో బలంగానే ఉన్నారు. జానారెడ్డి కూడా రెండు నియోజకవర్గాల్లో పట్టు సాధించారు. టీపీసీసీ అధ్యక్షుడిని కావాలని కోరుకుంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లపై పట్టు కలిగి ఉన్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతినే చాన్స్

కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతినే చాన్స్

కాంగ్రెస్‌ ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఉప ఎన్నిక అనివార్యమైతే అభ్యర్థిగా ఎవరున్నా ప్రతికూల ఫలితం వచ్చినా, వారి నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గినా ఉత్తమ్, జానారెడ్డి పదవులకు గండం తప్పకపోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాట్లాడే అవకాశమే ఉండదు. ఈ ఉప ఎన్నిక ఈ ముగ్గురికీ రాజకీయంగా జీవన్మరణ సమస్య కానున్నది. సాధారణ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ శ్రేణుల ఆత్మస్థైర్యం కూడా దెబ్బ తింటుంది.

ఇలా ఒకే ఉప ఎన్నికతో కాంగ్రెస్‌ పార్టీని, ఆ పార్టీలోని అగ్రనేతలు అందరికీ చెక్‌పెట్టే వ్యూహంతోనే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఈ పోరుకు సిద్ధం అవుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీలోనూ అసమ్మతి స్వరం వినిపిస్తున్నది. రైతు సమన్వయ సమితిలో గ్రామ స్థాయి మొదలు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సభ్యుల నియామకంపై దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, జడ్పీ చైర్మన్ బాలూ నాయక్ మధ్య విభేదాలు ఉన్నాయి.

తొలి నుంచి టీఆర్ఎస్ అడుగులు ఇలా

తొలి నుంచి టీఆర్ఎస్ అడుగులు ఇలా

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఉప ఎన్నికల తోనే పార్టీకి, ఉద్యమానికి కేసీఆర్‌ ఊపును తెస్తూ వచ్చారు. ఈ వ్యూహానికి కొనసాగింపుగా నల్లగొండ లోక్‌సభ ఉప ఎన్నికను తెస్తున్నట్టుగా ప్రతిపక్ష నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా ఉద్యమ ఆకాంక్షలకు ముడిపెడుతూ ఉప ఎన్నికలు జరిగాయని, ఇప్పుడు ఉప ఎన్నికల ఫిరాయింపుల ప్రాతిపదికన జరిగే ఎన్నిక తమకే సానుకూలంగా ఉంటుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికతోనే టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ఉచ్చుబిగించాలనే వ్యూహంతో కాంగ్రెస్‌ ఉంది. నేరుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం. ఈ ఉప ఎన్నికలో టీడీపీ కూడా ఉనికిని చాటుకోవడానికి చాపకింద నీరులా ప్రయత్నిస్తోంది. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించాలనే వ్యూహంతో ఆ పార్టీ ఉంది.

English summary
CM KCR make it clear that by election for Nalgonda MP constituency. Present sitting MP Gutha Sukhender Reddy won from Congress party while he had recently defected to TRS. But CM KCR to appoint as State coordinator of Rythu Samanva Samiti. It'll be legal complications and the same time CM KCR to aggressive attack to main opposition party congress before general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X