తెలంగాణలో సీబీఐ నిషేధం??
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిషేధిస్తారా? అనే సందేహం రాజకీయవర్గాలను తొలిచేస్తోంది. బీహార్ పర్యటనలో ఉన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే నిషేధించే అవకాశం ఉందనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. కొన్నాళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ సీబీఐ, ఈడీ, ఐటీలతో ప్రత్యర్థులను లొంగదీసుకుంటోందని, ప్రభుత్వాలను కూలదోస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే బీహార్‌లోని నితీష్ సర్కార్ సీబీఐ ప్రవేశాన్ని నిషేధిస్తూ చేస్తున్న డిమాండ్ కు కేసీఆర్ మద్దతిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946 సెక్షన్ ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు నిర్వహించాలనుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రాష్ట్రాలకు ఇష్టంలేక తమ సమ్మతిని ఉపసంహరించుకుంటే సీబీఐ హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టు అనుమతించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగేదేమీ ఉండదు.
పోలీసింగ్ అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోకూడదని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, పంజాబ్, మేఘాలయ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌తో కలిపి తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి తమ రాష్ట్రంలో ప్రవేశాన్ని నిషేధించాయి. గతంలో ఏపీ ప్రభుత్వం కూడా సీబీఐకి అనుమతి నిరాకరించింది.

బీహార్ డిమాండ్ కు మద్దతుగా కేసీఆర్
సీబీఐ ప్రవేశానికి సంబంధించి బీహార్ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్‌కు మద్దతిచ్చిన కేసీఆర్ త్వరలోనే తెలంగాణలో సీబీఐని కూడా నిషేధిస్తారంటూ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవిత పేరు వినిపిస్తోంది. దీనిపై ఆమె కోర్టుకెళ్లి తన పేరు ఉపయోగించుకుండా స్టే తెచ్చుకున్నారు. ఈ స్కాంలో దూకుడుగా ఉన్న సీబీఐ త్వరలో కవితను కూడా విచారించే అవకాశం ఉందన్న ముందస్తు ఆలోచనతో కేసీఆర్ సీబీఐని నిషేధించే అవకాశం కనపడుతోందంటున్నారు.

అన్ని రాష్ట్రాలు స్పందించాలని కోరుతున్న కేసీఆర్
బీహార్ పర్యటనలో భాగంగా కేసీఆర్ అన్ని రాష్ట్రాలు తమ తమ పరిధిల్లో సీబీఐ ప్రవేశాన్ని నిరాకరించాలని కోరారు. రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేంద్రం ఈ సంస్థను ఉపయోగిస్తోందని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా గళమెత్తుతోన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సీబీఐ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ తెలంగాణలో నెలకొంది.












Click it and Unblock the Notifications