దేశ రాజకీయాలలో చంద్రబాబు బిగ్ పర్సనాలిటీ: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!!
చంద్రబాబు అరెస్టు ఏపీకి సంబంధించిన విషయం.. తెలంగాణ రాష్ట్రానికి ఏమి సంబంధం? అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాలలో దుమారంగా మారాయి. చంద్రబాబు అరెస్ట్ అయితే హైదరాబాద్ లో ర్యాలీలు ఎందుకు? అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు నేతలు ఖండిస్తున్నారు.
తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై నిరసనలు చేస్తే తప్ప ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు తెలిపిన ఘటనలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

చంద్రబాబు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న ఆయన కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. చంద్రబాబు అరెస్టు కేవలం ఏపీకి సంబంధించింది కాదు, దేశ రాజకీయాలకు సంబంధించిన విషయమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు కావాలి కానీ వారి నిరసన వద్దా అంటూ ప్రశ్నించిన వాళ్ల నిరసన అడ్డుకుంటే మూతి పళ్ళు రాలగొడతారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు విషయంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు . ఏదైనా అనే ముందు హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకుంటే మంచిదని రేవంత్ రెడ్డి హితవు పలికారు. చంద్రబాబు దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడని, ఆయన అరెస్టు కేవలం ఏపీకే ఎలా పరిమితమవుతుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఐటి ఉద్యోగులు శాంతియుతంగా నిరసన తెలిపితే మీకు వచ్చిన నష్టమేమిటో చెప్పాలంటూ ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, దేశ రాజకీయాలలో చంద్రబాబు బిగ్ పర్సనాలిటీ అంటూ కితాబిచ్చారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేతలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications