9 రోజుల మిస్టరీకి తెర; Cherlapally కేసులో షాకింగ్ నిజాలు
చర్లపల్లి తల్లి - పిల్లల ఆత్మహత్య కేసు... తొమ్మిది రోజులుగా పోలీసులనే కాదు, తెలుగు రాష్ట్రాలకు ఓ మిస్టరీ. ప్రతి రోజు కొత్త అనుమానాలు, సోషల్ మీడియాలో ఊహాగానాలు, యూట్యూబ్ ఛానళ్లలో సంచలన కథనాలు... కానీ చివరకు నిజం ఏంటి?
పోలీసుల లోతైన దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయారెడ్డి కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వృత్తి పరంగా టీమ్ లీడర్‌గా పని చేస్తూ, ఆఫీస్ బాధ్యతలు, వ్యక్తిగత ఒత్తిళ్లు ఆమెపై తీవ్ర ప్రభావం చూపినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈ డిప్రెషన్‌నే ఆత్మహత్యకు దారితీసి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

విజయారెడ్డి మాటకు విరుద్ధంగా..
ఈ ఘటనలో అత్యంత కలచివేసే అంశం పిల్లల పాత్ర. విజయారెడ్డి మాటకు విరుద్ధంగా పిల్లలు ఎప్పుడూ వ్యవహరించేవారు కాదని పోలీసులు చెబుతున్నారు. తల్లి చెప్పిందే చేయాలనే స్థితిలో వారు ఉండేవారని, ఆమె పూర్తిగా పిల్లలపై నియంత్రణ కలిగి ఉండేదని తెలిపారు. ఆ మానసిక బంధమే చివరికి వారిని తల్లితో కలిసి ఆత్మహత్య దిశగా నడిపించి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా, విజయారెడ్డి రెండో ఫోన్ వాడిందన్న ప్రచారాన్ని పోలీసులు పూర్తిగా కొట్టిపారేశారు. ఆమె మరణానికి ముందు వారం రోజుల కాల్ డేటా, మెసేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించినా... ఎలాంటి అనుమానాస్పద కాల్స్, మెసేజ్స్ లభించలేదని స్పష్టం చేశారు.
Challapalli కేసుపై యూట్యూబ్ ఛానళ్లు అసత్య కథనాలు..
మరోవైపు, ఈ కేసుపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయని విజయారెడ్డి సోదరుడు చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ''మా కుటుంబం ఇప్పటికే తీవ్ర దుఃఖంలో ఉంది. ఆధారాలు లేకుండా ప్రచారం చేసి మమ్మల్ని మరింత వేధిస్తున్నారు'' అంటూ మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. పోలీసులు కోర్టుకు వెళ్లాలని సూచించడంతో, హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తామని ఆయన స్పష్టం చేశారు.
పోలీసులు క్లారిటీ..
ఇంతలోనే మరో ట్విస్ట్. డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలను పోలీసులు ఖండించారు. ''ముగ్గురి ఆత్మహత్యకు అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. దర్యాప్తు పూర్తయ్యాకే నిజాలు బయటపెడతాం'' అని స్పష్టం చేశారు.
అసలు నిజం ఏమిటి? డిప్రెషనా? లేదా ఇంకా బయటకు రాని మరో కోణమా? చర్లపల్లి తల్లి-పిల్లల కేసు... దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ మిస్టరీ ఉత్కంఠగానే కొనసాగనుంది. విజయారెడ్డి కేసలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications