ఢిల్లీలో కేసీఆర్ మకాం: జాతీయ రాజకీయాలపై ఫోకస్
హైదరాబాద్: తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మకంగా భావించే కొత్త సచివాలయాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. తొలి రోజే కొన్ని ఫైళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాలు చేశారు. అయిదువేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను క్రమబద్దీకరించారు. దీని తరువాత జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు కేసీఆర్. ఇవ్వాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే మకాం వేయనున్నారు.
పరిపాలనతో పాటు ఈ సంవత్సరం పాటు ఆయన రాజకీయాలకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తెలంగాణ. వచ్చే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తాను పరీక్షించుకోనుంది. ఈ రెండు ఎన్నికలను కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండింట్లోనూ సంపూర్ణ మెజారిటీతో గెలవడం ద్వారా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

భారత్ రాష్ట్ర సమితి అధినేతగా ఇక పూర్తిస్థాయి జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రవేశించడానికి ఈ సంవత్సరం కాలాన్ని వినియోగించుకోనున్నారు. ఇందులో భాగంగా- ఎక్కువకాలం ఢిల్లీలో గడిపే అవకాశాలు లేకపోలేదు. దీనికోసం అక్కడ పార్టీ జాతీయ స్థాయి కేంద్ర కార్యాలయాన్ని కూడా నిర్మిస్తోన్నారు. ఈ కార్యాలయ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఎల్లుండి దీన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్.
బీఆర్ఎస్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలవనున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బిహార్, పంజాబ్, తమిళనాడు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ, నితీష్ కుమార్, భగవంత్ మాన్, స్టాలిన్ బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్‌ను ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తరువాత ఢిల్లీ నుంచే దీనికి సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ సాగించాలనేది కేసీఆర్ ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఢిల్లీ వసంత్ విహార్‌లో పార్టీ కోసం శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నింటికీ ఇకపై ఢిల్లీ కేంద్ర బిందువు కానుంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయడం, వారితో వరుస భేటీలు, సమావేశాలను ఇక్కడి నుంచే సాగించాలని నిర్ణయించుకున్నారాయన.












Click it and Unblock the Notifications