ఢిల్లీ పోలీసులను కాకుంటే సరిహద్దు సైన్యాన్ని తెచ్చుకో.. భయపడేది లేదన్న రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులు విషయంలో మరోమారు స్పందించారు. ఢిల్లీ పోలీసుల నోటీసులపై ఘాటుగా వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి అమిత్ షా ను కెసిఆర్ ఆవహించినట్టు ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఆ నోటీసులపై మండిపడుతున్నారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి సెన్సేషన్
నేడు భూపాలపల్లిలో, జమ్మికుంటలో జరిగిన జన జాతర సభలలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బిజెపి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీభవన్ కు ఢిల్లీ పోలీసులను పంపి తనను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారని అమిత్ షా పైన ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులను కాకుంటే సరిహద్దు సైనికులను తెచ్చుకోమంటూ సవాల్ విసిరారు. ఎవరు వచ్చిన భయపడేది లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్ పెత్తనమా... తెలంగాణ పౌరుషమా తేల్చుకుందాం రండి
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను గురించి ప్రశ్నిస్తే తనపై తప్పుడు కేసులు పెట్టి తనను అరెస్టు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గుజరాత్ పెత్తనమా... తెలంగాణ పౌరుషమా .. తేల్చుకుందాం రమ్మని రేవంత్ రెడ్డి బిజెపి అగ్ర నేతలకు సవాల్ విసిరారు. ఈ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం
బిజెపితో కేసీఆర్ చీకటి ఒప్పందం పెట్టుకున్నాడని, కూతురు కవితను కాపాడుకోవడం కోసం బిజెపితో కెసిఆర్ పొత్తు పెట్టుకోబోతున్నారని, ఎన్నికలయిన తర్వాత అది జరుగుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికలలో బి ఆర్ ఎస్ కు ఒక్క ఓటు వేసినా అది వృధా, డ్రైనేజ్ లో వేసినట్టే అని ఎద్దేవా చేశారు. కారు కార్ఖానా కి పోయిందని దాన్ని తూకానికి అమ్మాల్సిందే అంటూ సెటైర్లు వేశారు.
తెలంగాణాకు ఇచ్చిందేంటి గాడిద గుడ్డు
ఇక సీతారాముల కళ్యాణం జరగకముందే బిజెపి బిజెపి రాములవారి అక్షింతలు పంచి హిందూ ధర్మాన్ని అవమానించిందని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రిగా మోడీ, తెలంగాణ రాష్ట్రానికి పదేండ్లలో ఏం ఇచ్చారో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు .గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్రమోడీ, బీజేపీ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చిందని గాడిద గుడ్డును ప్రదర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications