ఎన్నికలప్పుడే మోదీకి అవి గుర్తొస్తాయి: వారంటీ ఖతం
Revanth Reddy: జూన్ 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవాల కోసం.. తెలంగాణ సర్వసన్నద్ధమౌతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు కావడం వల్ల దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైభవంగా వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకోవడానికి చర్యలు తీసుకుంటోంది.
ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు దేశ రాజధానిలో ఆమెతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. దీనికి సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారు.

ఈ సమావేశం ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి.. విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఈ కార్యక్రమాలకు హాజరు కావాలంటూ సోనియా గాంధీని ఆహ్వానించామని, దీనికి ఆమె సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రివర్గ తీర్మానం సైతం చేశామని గుర్తు చేశారు.
మోదీ ప్రభుత్వంపై ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాకిస్తాన్ గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ముస్లింలు, రిజర్వేషన్లు.. ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలోనే గుర్తు చేసుకుంటారని, అంతే తప్ప తాము ఇచ్చిన హామీలను మాత్రం మోదీ గుర్తు చేసుకోబోరని ఎద్దేవా చేశారు.
ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పడానికి తానేమీ జ్యోతిష్యుడిని కాదని రేవంత్ రెడ్డి అన్నారు. జూన్ 9వ తేదీన ఎర్రకోటలో తమ పార్టీ.. జాతీయ జెండాను ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన.

400లకు పైగా సీట్లు సాధిస్తామంటూ మోదీ చెప్పడాన్ని తోసిపుచ్చారు రేవంత్. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్.. వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఆ మాటే చెప్పారని, ఆ తరువాత ఏమైందని ప్రశ్నించారు. మోదీ గ్యారంటీల వారంటీ ఖతం అయిందని, ఇక వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
కేంద్రం నుంచి బీజేపీ ప్రభుత్వాన్ని తప్పించాలని దేశ ప్రజలు నిర్ణయించారని, ఇప్పటివరకు జరిగిన ఆరు విడతల ఎన్నికల్లో ఇదే ప్రస్ఫూటమైందని పేర్కొన్నారు. మోదీ గానీ, బీజేపీ నాయకులు గానీ ఇచ్చే హామీలకు గ్యారంటీలు, వారంటీలు లేకుండాపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications