గోమాతకు సీమంతం చేసి మురిసిపోయిన దంపతులు .. రీజన్ ఇదే !!
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గర్భం దాల్చిన ఒక ఆవుకు ఘనంగా సీమంతం నిర్వహించారు ఓ దంపతుల జంట. ఆడపిల్లలంటే ఎంతో ఇష్టపడే ఆ జంటకు నలుగురు కుమారులు కావటంతో , కూతుళ్ళు లేకపోవడంతో కూతురు లేని లోటు తీర్చుకోవడం కోసం వారు ఒక ఆవును కన్నబిడ్డలా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఆవు గర్భం దాల్చడంతో వారు ఆవుకు సీమంతం నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

గోవును కన్నబిడ్డలా పెంచుకున్న దంపతులు
గోవులను అమితంగా ప్రేమించే హనుమకొండ ఎస్బిహెచ్ కాలనీకి చెందిన వీరేశం దంపతులు గోశాలకు వెళ్లి ఆవులకు గడ్డి పట్టి వస్తుండే వారు . వారికి నలుగురు కుమారులు . వారికి కూతుళ్ళు లేకపోవడంతో , రెండో కుమారుడు తల్లిదండ్రులు గోవుల పట్ల చూపించే ప్రేమను గుర్తించి ఒక గోవును 30 వేల రూపాయలకు కొనుగోలు చేసి తల్లిదండ్రులకు ఇచ్చారు . దీంతో వారు ఆ ఆవునే తమ బిడ్డలా భావించి ఎంతో ప్రేమతో గోమాతను పెంచుకుంటున్నారు.

గోవుకు సీమంతం చేసిన దంపతులు
దానినే కన్న బిడ్డలా సాకుతున్నారు. ఒక ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని దానిని కన్నబిడ్డల్లా సాగుతున్నారు. అయితే ఇటీవల ఆ ఆవు గర్భం ధరించినట్లు తెలిసింది. దీంతో వారు పట్టరాని సంతోషానికి గురై సొంత కూతురికి నిర్వహించినట్లుగా, హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవుకి సీమంతం చేశారు. చాలా అట్టహాసంగా ఒక ఆడపిల్లకు తల్లిదండ్రులు ఎలాగైతే సీమంతం చేస్తారో అలాగే గోవుకు కూడా సీమంతం జరిపారు . పండంటి బిడ్డను కనాలని ఆకాంక్షించారు .

గోమాత కు సీమంతంలో పాల్గొన్న ధరణి సాయి సేవా సంఘ్
హన్మకొండ పీజేఆర్ గార్డెన్స్ లో వీరేశం, శోభ దంపతులు గోమాతకు నిర్వహించిన సీమంతం కార్యక్రమంలో ధరణి సాయి సేవా సంఘ్ కూడా పాలుపంచుకుంది.
సీమంతంలో భాగంగా వరంగల్ కాశిబుగ్గ రామాలయం పూజారి మధు చారి సమక్షంలో ఆవుకు గాజులతో పాటు పూలు,పండ్లు, చీర, కుంకుమ వంటివి పెట్టి చాలా వైభవంగా సీమంతం జరిపించారు. గోమాతకు ఎంతో ఘనంగా జరుగుతున్న సీమంత వేడుకను పలువురు తిలకించారు.