బ్లాక్ మెయిల్: భర్తతో ఏకాంతంగా ఉన్న మోడల్ వీడియోలు, చిత్రాలను తస్కరించిన హ్యాకర్
హైదరాబాద్: తన భర్తతో కలిసి ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న ప్రైవేట్ వీడియోలు, చిత్రాలను ఓ వివాహిత గూగుల్ క్లౌడ్‌లో దాచుకుంది. వాటిని ఓ హ్యాకర్ తెలివిగా దొంగిలించి వాటిని తిరిగి ఆమెకే పంపించి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ప్రాక్సీ సర్వర్లను వినియోగించాడు.
ఎట్టకేలకు పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన ఆ సైబర్ నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత తెలిసింది అతడో బాల నేరస్థుడని. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం నగరానికి చెందిన ఓ వివాహితకు మోడలింగ్ రంగంపై ఆసక్తి. దీంతో ఆ రంగానికి సంబంధించిన అంశాలపై మెయిల్స్ ద్వారా సమాచారం సేకరించేది.
గతంలో తన భర్తతో కలిసి ఏకాంతంగా గడిపిన వీడియోలు, చిత్రాల్ని ఆమె తన గూగుల్ క్లౌడ్‌లో దాచుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ దుండగుడు ఆమె మెయిల్‌ను హ్యాక్ చేశాడు. ఈ క్రమంలో ఆమెకు మోడలింగ్ రంగంపై ఉన్న ఆసక్తిని గుర్తించి మలీషియస్ కోడ్‌ను ఆమె ఖాతాలోకి పంపించాడు.
దీనిని ఆమె గమనించకపోవడంతో వైరస్ ఆమె ఖాతాలోకి ప్రవేశించింది. ఈక్రమంలో గూగుల్ క్లౌడ్‌లోని వీడియోలు, చిత్రాలను దుండగుడు తస్కరించాడు. అంతటితో ఆగకుండా ఖాతాలోని వివరాల ఆధారంగా ఆమె సెల్‌ఫోన్ నెంబరును తెలుసుకొని గత మే నెలలో వాట్సప్ ద్వారా ప్రైవేట్ వీడియోలు, చిత్రాలను బాధితురాలికే పంపించాడు.

రూ.5లక్షలు చెల్లించకపోతే వాటిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. బాధితురాలితో మాట్లాడిన ఆనవాలు తెలియకుండా ఉండేందుకు నకిలీ ఆధారాలతో కొనుగోలు చేసిన సిమ్‌ను ఉపయోగించాడు. దీంతో బాధితురాలు ఒక్కసారి ఆందోళనకు గురైంది.
అదే సమయంలో బాధితురాలు భర్తతో కలిసి యూరప్‌లో ఉండటంతో ఆమె తండ్రి సైబరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన సైబరాబాద్ క్రైమ్ పోలీసులు దుండగుడు వినియోగించిన సెల్‌ఫోన్ నంబరుపైఆరా తీయగా ఆధారాలు లభించలేదు.
దీంతో పోలీసులు 'రివర్స్ ఫుట్ ప్రింట్' సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బాధితురాలి వీడియోలను దొంగిలించేందుకు దుండగుడు వినియోగించిన కంప్యూటర్ చిరునామా కనుగొన్నారు. చత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ వెళ్లి దుండగుడిని అరెస్టు చేశారు. అతడు బాల నేరస్థుడు కావడంతో పోలీసులు అవాక్కయ్యారు.
అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచి ఆదివారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇతగాడిపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. గతంలో ముంబై, పుణెల్లో అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని నిర్వహించాడు. మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగానికి సంబంధించిన అంశాలపై తరచూ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసేవాడు.
ఈక్రమంలో గత డిసెంబరులో ముంబైకి చెందిన ప్రసిద్ధ మోడల్ ప్రైవేట్ వీడియోలను తస్కరించాడు. వాటిని పంపించి డబ్బుల కోసం బెదిరించడంతో ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసులో అరెస్టయిన అతడిని బాల నేరస్థుల కారాగారానికి పంపించారు.
విడుదలైన అనంతరం తిరిగి పుణెలో మరో యువతికి గాలమేశాడు. ఆమె భయపడి రూ.55వేలను బాలనేరస్థుడు సూచించిన బ్యాంకు ఖాతాలో వేసింది. మరింత డబ్బు కోసం వేధించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి బ్యాంకు ఖాతా అధారంగా గత మార్చిలో అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మూడోసారి సైబరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications