అమెరికా వెళ్లి వచ్చేలోగా బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయండి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలు
నల్గొండ: జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే నేలమట్టం చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శనివారం నల్గొండకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మున్సిపల్ కౌన్సిల్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం కమిషనర్, అడిషనల్ కలెక్టర్ ను పిలిపించుకుని.. బీఆర్ఎస్ కార్యాలయ కూల్చివేతపై ఆదేశాలు జారీ చేశారు. ఈ బీఆర్ఎస్ కార్యాలయ కూల్చివేతపై ఇప్పటికే ఓసారి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇప్పుడు మరోసారి ఆదేశించారు.

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌కు శనివారం వ్యక్తిగతంగా నోటీసులు అందజేశారు. తాను అమెరికా వెళ్లి వచ్చే లోగా అంటే ఆగస్టు 11వ తేదీలోగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. లేదంటే కమిషనర్‌పై కేసు పెట్టి ఎందుకు కూల్చడం లేదో విచారించి జైలుకు పంపించాలని అడిషనల్ కలెక్టర్‌ను ఆదేశించారు. కమిషనర్ ఈ విషయంలో స్పందించకపోతే దగ్గరుండి బీఆర్‌ఎస్ ఆఫీసు కూల్చే విధంగా బాధ్యత తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి సూచించారు.
ప్రభుత్వ భూమిని అక్రమంగా అక్రమించుకున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఆఫీసు రేకులను విప్పి పార్టీ అధ్యక్షుడి ఇంటి దగ్గర పెట్టేసి వెంటనే కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ సమీప కాలనీలకు మంచినీటి సరఫరా నిమిత్తం 20 లక్షల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నివేదిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మరోవైపు, స్త్రీ నిధి భవనం కూడా అక్కడ నిర్మించి పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.












Click it and Unblock the Notifications