తన్నే రోజులు దగ్గరపడ్డాయి: కెసిఆర్‌పై డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన్నులు తినే రోజులు ముందున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జలసాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు మహా పాదయాత్ర సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చేరింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందని మండిపడ్డారు.

గతంలో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచి ఏం సాధించావ్ అంటూ కెసిఆర్‌పై ఆమె విరుచుకుపడ్డారు. పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

''బాంచన్‌ దొర నీ కాల్మొక్తా' అంటూ కాళ్లకాడ పడి ఉంటారని అనుకుంటున్నావేమో.. ఈ ప్రాజెక్టులు పూర్తికాకపోతే తన్నే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి' అని డీకే అరుణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరైనా భూమిని సర్వే చేసి ప్రాజెక్టులు చేపడతారని, ఈయనేమో గూగుల్‌లో చూసి ప్రాజెక్టులను కట్టడం ఏమిటో అర్థం కావడంలేదన్నారు.

మాయమాటలు చెప్పి ప్రజాసంక్షేమం విస్మరిస్తున్న కేసీఆర్‌కు అబద్ధాలకోరు అవార్డు ఇవ్వచ్చని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మల్లన్నసాగర్ రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కునేందుకు యత్నిస్తుందన్నారు.

DK Aruna fires at CM KCR

భూములు లాక్కుంటూ లాఠీ ఛార్జీ చేయిస్తారా?: లక్ష్మణ్

రైతులపై లాఠీ ఛార్జీ చేయించి, ప్రశ్నించేవారిని అణచివేసి భూములను లాక్కుంటామంటే సహించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను బయటపెట్టకుండా, దాచిపెట్టడంలో మర్మం ఏమిటని ప్రశ్నించారు.

రైతులు, నిర్వాసిత గ్రామస్తులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులతో లాఠీ ఛార్జీ చేయించడం అమానుషమని అన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్లిన బిజెపి, ఇతర పార్టీల నేతలను అరెస్ట్ చేయడం అక్రమమని అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపడుతున్నట్లు ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress MLA DK Aruna on Monday fired at Telangana CM K Chandrasekhar Rao.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి