డీఎస్పీగా డ్రైవర్ కూతురు.. తెలంగాణ యువతి సక్సెస్ జర్నీ !!
ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమనేది నేటి యువతకు ఒక కల. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ యువతి. తన తండ్రి డ్రైవర్ గా జీవనం సాగిస్తూ తమ కోసం పడుతున్న కష్టానికి అండగా నిలవాలని.. పట్టుదలతో చదివి విజయం సాధించింది. మొక్కవోని దీక్షతో డ్రైవర్ గా చేస్తూ కూతురుని చదువులో ముందుకు నడిపించారు ఆ తండ్రి. పేదరికం, సామాజిక సమస్యలు ఎదురైనా కానీ వారు చదువుపై అంకితభావంతో భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంది యువతి. కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి తల్లిదండ్రుల కలను నిజం చేసి చూపించింది.
మహబూబ్ నగర్ జిల్లా రేవలి మండలంలోని శానాయిపల్లి గ్రామానికి చెందిన మండ్ల కవిత ప్రతిష్ఠాత్మక గ్రూప్-1 పరీక్షలో అద్భుత విజయాన్ని సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కవిత.. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ పట్టుదలతో ముందుకు సాగి ఈ స్థాయికి చేరుకుంది. కవిత తండ్రి మండ్ల నాగన్న డ్రైవర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. ఆమె తల్లి భారతమ్మ వ్యవసాయ కూలీగా కష్టపడి పిల్లలకు విద్యనందించారు. కవిత చిన్నప్పటి నుండే ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని క్రమశిక్షణతో చదువుతూ తన కలను సాకారం చేసుకుంది.

ఉద్యోగం చేస్తూనే గ్రూప్-1 ప్రిపేర్..
కవిత విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించి ప్రస్తుతం నాగర్ కర్నూల్ పట్టణంలో విధులు నిర్వహిస్తోంది. అయితే తన లక్ష్యం ఇక్కడితో ఆగిపోలేదు. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ గ్రూప్-1కు కష్టపడి ప్రిపేర్ అవ్వడం, తన పట్టుదల, నిబద్ధతను చాటిచెప్పింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పరీక్షలో విజయం సాధించి డీఎస్పీగా ఎంపిక కావడం ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.
కవిత విజయంతో శానాయిపల్లి గ్రామంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గ్రామస్తులు ఆమె తల్లిదండ్రులను అభినందించగా.. యువతకు కవిత ప్రేరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. కేవలం చదువు మాత్రమే కాకుండా, కష్టపడే తత్వం, పట్టుదల, అంకితభావం విజయానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడంతో వారికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications