కోల్‌ఇండియా తరహాలో సింగరేణి అధికారులకు దసరా ధమాకా!
దసరా పండుగ వేళ సింగరేణి అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద శుభవార్త అందించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో సుమారు 1,800 మంది అధికారుల కుటుంబాలలో = సంతోషం వెల్లివిరిసింది. కోల్‌ఇండియా తరహాలో వేతనాలు పెంచాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
ఎగ్జిక్యూటివ్ క్యాడర్-1 నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాడర్-7 వరకు ఉన్న అధికారులకు ఈ పెంపు వర్తిస్తుంది. సవరించిన బేసిక్ వేతనాలు 2017 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. అయితే ఆర్థిక ప్రయోజనాలు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపిన 2026 సెప్టెంబర్ 25 నుంచి వర్తిస్తాయి. పెరిగిన వేతనాలను అక్టోబర్ నెల జీతాల నుంచే చెల్లించనున్నారు. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పోట్రు ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త వేతనాల ప్రకారం అధికారుల బేసిక్ ఇలా ఉంటుంది:
E-1 అధికారులకు : రూ.40,000 నుంచి రూ.60,000
E-2 అధికారులకు : రూ.50,000 నుంచి రూ.70,000
E-3 అధికారులకు : రూ.60,000 నుంచి రూ.80,000
E-4 అధికారులకు: రూ.70,000 నుంచి రూ.90,000
E-5 అధికారులకు : రూ.80,000 నుంచి రూ.1,00,000
E-6 అధికారులకు : రూ.90,000 నుంచి రూ.1,20,000
E-7 అధికారులకు: రూ.1,00,000 నుంచి రూ.1,20,000
ఈ నిర్ణయం వెనుక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారు. కోల్‌ఇండియాలో వేతన అసమానతల నేపథ్యంలో మహారత్న సంస్థల వేతన విధానాన్ని అమలు చేయాలని అక్కడి అధికారులు కోరగా, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్‌ఇండియా యాజమాన్యం ఆమోదం తెలిపాయి. అదే విధానాన్ని సింగరేణిలోనూ అమలు చేయాలని సింగరేణి అధికారులు డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు.
జూలైలోనే దసరా లోపు శుభవార్త అందేలా చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆ తర్వాత కమిటీ ఏర్పాటు చేసి, నివేదిక ఆధారంగా బోర్డు ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే దసరా సందర్భంగా సింగరేణిలోని దాదాపు 39 వేల మంది కార్మికులు, ఉద్యోగులకు రూ.596 కోట్ల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం, కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.5,500 చొప్పున బోనస్ ఇచ్చింది.
ఇప్పుడు అధికారులకు వేతన సవరణ జరగడంతో సంస్థలోని అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూరినట్టయింది. సింగరేణి అధికారుల సంఘం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఇంధన అవసరాల కోసం మరింత అంకితభావంతో బొగ్గు ఉత్పత్తి పెంచి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతామని హామీ ఇచ్చారు.
సింగరేణి తెలంగాణకు కీలకమైన బొగ్గు ఉత్పత్తి సంస్థ. ఇక్కడి అధికారులు, కార్మికులు సంతోషంగా పని చేస్తే రాష్ట్ర విద్యుత్ అవసరాలు సక్రమంగా తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల అధికారుల్లో ఉత్సాహం పెరిగి, ఉత్పాదకత మరింత పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
